BRS Harish Rao On Chief Whip Issue : రాష్ట్రంలో రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని, శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా పట్నం మహేందర్ రెడ్డి నియామకం ఇందుకు మరో ఉదాహరణ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీశ్‌రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన మహేందర్ రెడ్డిని ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమించడం రాజ్యాంగ విరుద్ధమని, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తోందని ఆక్షేపించారు. మండలిలో బిల్ పాస్ చేయించడం, ప్రభుత్వ బిజినెస్ జరిగేలా చూడడం చీఫ్ విప్ బాధ్యత అని, మహేందర్ రెడ్డి ఇప్పుడు ఎవరికి విప్ ఇస్తారని ప్రశ్నించారు.
Harish Rao Fires On Congress :ఆయన అధికార పార్టీ సభ్యులకు విప్ ఇస్తారా? లేక ప్రతిపక్ష పార్టీ సభ్యులకు విప్ ఇస్తారా? అని అడిగారు. బీఆర్ఎస్‌కు కూడా మండలిలో విప్ ఉంటారని, సభకు హాజరు, బిల్లుపై ఓటింగ్ సమయంలో బీఆర్ఎస్ విప్ కూడా పార్టీ సభ్యులకు విప్ ఇస్తారని హరీశ్‌రావు వివరించారు. ఇప్పుడు బీఆర్ఎస్ విప్ ప్రభుత్వ చీఫ్ విప్‌కు కూడా విప్ ఇస్తారని పేర్కొన్నారు. చీఫ్ విప్ ఇప్పుడు బీఆర్ఎస్ విప్ ప్రకారం నడుచుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు. పీఏసీ ఛైర్మన్ విషయంలో కూడా ఇలాగే వ్యవహరించారని గుర్తు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు సంబంధం లేదు అన్నారని, ఇప్పుడు బీఆర్ఎస్‌కు చెందిన మహేందర్ రెడ్డికి ప్రభుత్వ చీఫ్ విప్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.