BRS Focus on Lok Sabha Elections 2024: రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించి, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్లిన భారత రాష్ట్ర సమితి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటుందనే చెప్పొచ్చు. ఓటమి నుంచి కోలుకోక ముందే పలువురు నేతలు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. సిట్టింగ్ ఎంపీలతో పాటు జడ్పీ ఛైర్మన్లు, వివిధ స్థాయి ప్రజాప్రతినిధులు, మాజీలు, సీనియర్ నేతలు గులాబీ పార్టీని వీడుతున్నారు. కొందరు ఎన్నికల్లో పోటీకి విముఖత చూపుతున్నారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగుతున్నాయి.
ఏమాత్రం అవకాశం వచ్చినా, కారు పార్టీని దెబ్బ తీయాలని చూడడంతో పాటు భవిష్యత్‌లో మనుగడ కష్టమంటూ వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. అనారోగ్యం నుంచి కోలుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కారును తిరిగి ట్రాక్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని ప్రారంభించారు. త్వరలోనే జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు పార్టీని, నేతలను సంసిద్ధం చేసే పనిలో పడ్డారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు.
లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన కేసీఆర్ - ఫస్ట్ లిస్ట్‌లో వీరికే ఛాన్స్
BRS President KCR Meeting With Leaders: రాజకీయాల్లో ఉన్న వారికి గెలుపు ఓటములు సహజమేనని, ఎన్టీఆర్ ఉదంతాన్ని కూడా కేసీఆర్‌ప్రస్తావిస్తున్నారు. ఎన్నో మంచి పనులు చేసినప్పటికీ, ఎన్టీఆర్ 1989లో ఓటమి పాలయ్యారని, 1994లో మళ్లీ ఘన విజయం సాధించారని చెబుతూ నేతల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క ఓటమికే కుంగిపోవాల్సిన అవసరం లేదని, అలా కుంగిపోయి ఉంటే తాను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేవాడినా అని ప్రశ్నిస్తున్నారు. కొందరు నేతలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, ఎందుకు డీలా పడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.