Sabita Indrareddy fires on CM Revanth : శాసన సభలో ఏం జరిగిందో ప్రజలందరూ చూశారని, మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో కేటీఆర్ ప్రతి అంశాన్ని కూలంకషంగా వివరించే ప్రయత్నం చేశారని, కేటీఆర్ ప్రసంగం నుంచి దృష్టి మళ్లించేందుకు రేవంత్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి మహిళలు అంటే గౌరవం లేదని, సోనియా మెుదలు సబిత వరకు అందరిపై సీఎం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
మహిళలపై గౌరవం లేదు : అక్కలను నమ్ముకుంటే ముంచుతారని, జూబ్లీ బస్టాండ్ అవుతుందని సీఎం రేవంత్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారని సబిత వాపోయారు. రేవంత్ కాంగ్రెస్‌లోకి రాకముందే హస్తం పార్టీకి తాము సేవలందించామని సబిత ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. భుజాన జెండా వేసుకుని కాంగ్రెస్ కోసం కష్టపడ్డామని, కాంగ్రెస్ అధికారంలోకి రావాలని తాను, సునీత కోరుకున్నట్లు ఆమె తెలిపారు. తాను, సునీత పార్టీకి మోసం చేశామని రేవంత్ మాట్లాడారని, రేవంత్‌ను కాంగ్రెస్‌లోకి రావాలని కోరడమే తాను చేసిన తప్పని ఆమె తెలిపారు.
భేషరతుగా క్షమాపణ చెప్పాలి :ఆడబిడ్డలు క్షేమం కోరుకుంటారు, నమ్మినవారికి ప్రాణం ఇస్తారని మాజీమంత్రి సబిత ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ రోజు జరిగిన అవమానం సునీత, సబితకు మాత్రమే కాదని, సభలో జరిగిన దానిపై ప్రతి ఇంట్లోని ఆడపిల్లలు ఆలోచిస్తున్నారని ఆమె తెలిపారు. 24 ఏళ్ల నుంచి తాను అసెంబ్లీకి వస్తున్నానని, సీఎం పీఠంపై చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, కేసీఆర్‌ను చూశానన్నారు. ఈరోజు సీఎం పీఠంపై రేవంత్‌రెడ్డిని కూడా చూస్తున్నానని, నిండు సభలో మహిళలపై మాట్లాడి సీఎం పీఠాన్నే రేవంత్‌రెడ్డి అగౌరపరిచారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.