Boy Died after chunni wrapped around Neck : బట్టలు ఆరేసేందుకు భవనంపైకి వెళ్లిన ఓ బాలుడు, చున్నీతో ఆడుకుంటుండగా అది మెడకు చుట్టుకుని ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన ఘటన గచ్చిబౌలి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, సూర్యాపేట జిల్లా మోతే మండలం విభలపూర్ గ్రామానికి చెందిన జిల్ల రమేశ్, అతని భార్య లక్ష్మి, కుమారుడు సాత్విక్ (12)తో కలిసి కొండాపూర్ ప్రాంతానికి వలస వచ్చారు. రమేశ్ ఆటో నడుపుతుండగా ఆయన భార్య స్థానికంగా ఉన్న పామ్ రిడ్జ్ విల్లాస్లో పని మనిషిగా పని చేస్తున్నారు. విల్లాలోని ఓ సర్వెంట్ రూమ్లో ఉంటున్నారు. సాత్విక్ మసీద్ బండ ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 22న మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు లక్ష్మి బట్టలు ఉతికింది.
వీటిని ఆరేస్తానంటూ విల్లా డాబాపైకి వెళ్లిన సాత్విక్, ఎంతసేపటికీ కిందకు రాకపోవడంతో అనుమానంతో తల్లి పైకివెళ్లి చూసింది. సాత్విక్ మెడకు, ముఖానికి చున్నీ చుట్టుకొని అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే లక్ష్మి తన కుమారుడిని కొండాపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. సాత్విక్ ఒంటరిగా పైకి వెళ్లగా, గంట తర్వాత అతని తల్లి మాత్రమే పైకి వెళ్లి చూసినట్లుగా సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైందని పోలీసులు తెలిపారు. చున్నీతో ఆడుకుంటుండగా అది అతని మెడకు చుట్టుకుందని, దీంతో ఊపిరాడక బాలుడు మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం శవపరీక్ష నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.