Irregularities in MGNREGS works:ఉపాధి హామీ పథకం అక్రమార్కుల పాలిట వరంలా మారింది. చనిపోయిన, వృద్ధుల పేర్లను మస్టర్‌లో చేర్చి బోగస్ ఖాతాలతో దండుకుంటున్న ఘటన శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం రామాపురం గ్రామంలో వెలుగుచూసింది. ఫీల్డ్ అసిస్టెంట్ ఉపాధి హామీ పథకం చనిపోయిన, పండు వృద్ధుల పేర్లతో ప్రైవేట్ బ్యాంకుల్లో బోగస్ ఖాతాలు తెరిచి కోట్ల రూపాయలు జేసినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధి అండతోనే ఉపాధిహామీ పనుల్లో అక్రమాలపై ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
మృతుల పేర్లతో ఖాతాలు: వ్యవసాయ కూలీలు, గ్రామీణ పేదలు ఉపాధి కోసం వలసలు వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో ఉపాధి పొందేలా ఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో అక్రమాలను వెలికితీసి, సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకునే ఆడిట్ వ్యవస్థ ఉన్నప్పటికీ, దీన్ని అవినీతికి చిరునామాగా మార్చేశాడు. శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో రామాపురం చిన్న గ్రామం ఫీల్డ్ అసిస్టెంట్ ఉపాధిహామీ పనుల్లో పెద్దఎత్తున అక్రమాలను చోటుచేసుకొని కోట్ల రూపాయలు కాజేస్తున్నాడు. గ్రామంలో దశాబ్దంన్నర క్రితం మృతి చెందిన వారు కూడా ఉపాధిహామీ పనులు చేసినట్లు ఫీల్డ్ అసిస్టెంట్ మస్టర్‌లో పేరు చేర్చాడు. ఇలా సుమారు ముప్పై మంది మృతుల పేర్లను మస్టర్ లో ఎక్కించి వారంతా 40 రోజుల నుంచి 96 రోజులు పనిచేసినట్లుగా మస్టర్ వేశాడు. వీరి పేరుతోనే ప్రైవేట్ బ్యాంకుల్లో బోగస్ ఖాతాలు తెలిచాడు. మస్టర్ ప్రకారం ప్రభుత్వం నుంచి వచ్చిన సొమ్ము బోగస్ ఖాతాల్లో పడగానే నగదును విత్ డ్రాచేస్తున్నారు.