BJP Vijaya Sankalpa Yatra 2024 : పార్లమెంట్ ఎన్నికల్లో సత్తాచాటేలా సమరశంఖం పూరించిన భారతీయ జనతా పార్టీ 17 లోక్‌సభ నియోజకవర్గాలను చుట్టేసేలా విజయ సంకల్ప యాత్రలు కొనసాగిస్తోంది. నారాయణపేట జిల్లాలో కృష్ణమ్మ క్లస్టర్ విజయ సంకల్పయాత్రలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఓట్లేస్తే మూసీలో పడినట్లేనని కిషన్‌రెడ్డి విమర్శించారు.
Kishan Reddy Comments BRS : కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయిందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం మరిచినా కేంద్రం రూ.100 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు రాకపోయినా బీఆర్ఎస్ జరిగే నష్టం ఏమీ లేదని అన్నారు. కాంగ్రెస్ సర్కార్‌పై అపుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్న ఆయన హామీలు అమలుచేయలేక పోతోందని విమర్శించారు.
"ఈ జిల్లా యువత, విద్యార్థులకోసం పాలమూరు విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు ప్రధాని మోదీ మంజూరు చేశారు. ఆయుష్మాన్ భారత్ పేరిట రూ.5లక్షల కార్పొరేట్ వైద్యాన్ని కేంద్రం అందిస్తుంది. ఈరోజు దేశంలో ఎక్కడ కూడా శాంతిభద్రతల సమస్యలు లేవు. మోదీ హయాంలో అయోధ్య రామ మందిరాన్ని నిర్మించుకున్నాం." - కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
రెండోరోజు కొనసాగిన బీజేపీ విజయ సంకల్పయాత్ర - కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై కమలం నేతల ఫైర్
BJP Vijaya Sanklpayatra Third Day : కుమురంభీం క్లస్టర్ బీజేపీ విజయసంకల్ప బస్సు యాత్రలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడింది కమలం పార్టీ కార్యకర్తలేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. హస్తం పార్టీ నాయకులు ఏ నాడైనా కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడారా అని ప్రశ్నించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికీ వాటి ఊసెత్తడం లేదని విమర్శించారు. కోలుకోలేని స్థితిలో ఉన్న బీఆర్ఎస్తో తమకు పొత్తు ఉండదని బండి సంజయ్ తేల్చిచెప్పారు.