BJP Vijaya Sankalp Yatra In Adilabad: పార్లమెంట్ ఎన్నికల్లో సత్తాచాటేలా సమరశంఖం పూరించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలను చుట్టేసేలా చేపట్టిన విజయ సంకల్ప యాత్రలు మూడోరోజు కొనసాగాయి. ఆదిలాబాద్‌లో నిర్వహించిన యాత్రలో పాల్గొన్న ఈటల రాజేందర్ (Etela Rajender) మూడోసారి మోదీ ప్రధాని అవ్వడం ఖాయమని పునరుద్ఘాటించారు. అధికారం కోసం ఇష్టమొచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీలు ఇచ్చిందని అవి ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుపై కాంగ్రెస్(Congress) ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna) మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్కు మధ్యే లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే కొడంగల్‌లో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారన్నారు.
ఉత్సాహంగా సాగుతున్న బీజేపీ విజయ సంకల్ప యాత్ర - కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై కమలం నేతల ఫైర్
"కాంగ్రెస్ పార్టీ ఏ హామీలు ఇచ్చిందో ఇంకో ఆరు నెలలు వేచి చూస్తాం. కాంగ్రెస్ చేసే పనులను విమర్శించడానికి రాలేదు. ఇన్ని రకాల అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. తెలంగాణ ఉద్యమంలో వేల మంది నిరుద్యోగులు బలి అయ్యారు. ఎన్నో ఏళ్ల నాటి రామామందిర నిర్మాణం కల మోదీ వల్ల సాధ్యం అయ్యింది."-ఈటల రాజేందర్, బీజేపీ నేత
BJP Hits Road For Lok Sabha Campaign : అమలు సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మూడు నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(Arvind) విమర్శించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన బీజేపీ, కాంగ్రెస్‌లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కొండ విశ్వేశ్వర్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్, మునుగోడు నియోజవర్గాల్లో నిర్వహించిన యాత్రలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.