Raghunandanrao Complaint To EC Against BRS: వరంగల్ - నల్గొండ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్పై బీజేపీ మాజీ ఎమ్మెల్యే, మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు సంచలన ఆరోపణ చేశారు. ఈ ఎన్నికల్లో రూ.30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు బీఆర్ఎస్ పార్టీ తెరలేపిందన్నారు. డబ్బులు పంచి గెలవాలని ప్రయత్నం చేస్తున్నందుకు ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు కొనాలన్న బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం ఆపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌కు రఘునందన్‌రావు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.
బాధ్యులపై వెంటనే చర్యలు చేపట్టండి :ఓ బ్యాంక్‌లోని బీఆర్ఎస్ అధికారిక ఖాతా నుంచి 30 మంది ఎన్నికల ఇన్‌ఛార్జులకు కోటి చొప్పున నగదు బదిలీ జరిగినట్లు రఘునందన్ ఆరోపించారు. బ్యాంక్ అకౌంట్ వివరాలను ఎన్నికల సంఘానికి రాసిన లేఖతో జతపరిచారు. దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని లేకుంటే కోట్లాది రూపాయలను ఓట్ల కొనుగోలుకు ఉపయోగిస్తారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఖాతాను వెంటనే ఫ్రీజ్ చేసి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ డబ్బు ద్వారా మాత్రమే ఎన్నికలు గెలవాలనే దుర్మార్గమైన ప్రయత్నం చేస్తుందన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కారు పార్టీ చిల్లర ప్రయత్నాలు చేసిందని విమర్శించారు.
"గత ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఎన్నికల్లో కేవలం డబ్బు ద్వారా మాత్రమే గెలవాలనే దుర్మార్గమైన ప్రయత్నం చేస్తున్నారు. ఆఖరి ప్రయత్నంగా రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంఛార్జీలను పెట్టి ఓట్లు కొనేందుకు ఆ పార్టీ ప్రతినిధులకు ఓ ఖాతానుంచి రూ.30 కోట్లను బదిలీ చేసింది"- రఘునందన్‌రావు, బీజేపీ నేత