Global Spirtuality Mahotsav 2024 : భారతదేశం అంటే సంస్కృతి, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భారత్ స్ఫూర్తితో యావత్ ప్రపంచం ప్రభావితం అవుతోందని ఆయన తెలపారు. ఈ నెల 14 నుంచి 17వ వరకు రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతివనంలో(Kanha Shantivanam) కేంద్ర పర్యాటక శాఖ, హార్ట్‌ఫుల్‌నెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరగనున్న "గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ్ 2024" పురస్కరించుకుని కేంద్రమంత్రి మాట్లాడారు.
Kishan reddy on Spirtuality Mahotsav 2024 : ఈ నెల 15న జరిగే ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యి, ఆమె చేతుల మీదుగా ఉత్సవాన్ని ప్రారంభిస్తారని కిషన్రెడ్డి(Kishan reddy) తెలిపారు. మరుసటి రోజు 16న జరగనున్న కార్యక్రమానికి, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ హాజరవుతారని పేర్కొన్నారు. అలాగే, ముగింపు రోజు 17న ప్రపంచ ప్రఖ్యాత గురువులతో సమాలోచనలు జరుగుతాయని వెల్లడించారు.
దేశాన్ని ఆధ్యాత్మిక చింతనతో ఓ సానుకూల మార్గం వైపు తీసుకెళుతున్నామని కిషన్రెడ్డి తెలిపారు. ఇది 140 కోట్ల ప్రజలకు గర్వకారణమని సంతోషం వ్యక్తం చేశారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక చింతన ద్వారా యావత్ ప్రపంచాన్ని మనం ప్రభావితం చేస్తున్నామన్నారు. స్వామి వివేకానంద మొదలుకుని అనేక మంది మహానుభావులు, గురువులు మన గొప్పతనం, మన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెబుతున్నారని తెలిపారు.
అందుకే యావత్ ప్రపంచం ఇవాళ భారతదేశం వైపు గౌరవ భావంతో చూస్తోందని కిషన్రెడ్డి అన్నారు. కరోనా అనంతరం ప్రజల్లో ఆధ్యాత్మిక భావన మరింత పెరిగిందని ఆయన స్పష్టం చేశారు. భారతదేశం హిందూ, ముస్లిం, బౌద్ధ, జైన, సిక్కు మతాలకు పుట్టినిల్లని, అనేక మతాలు ప్రపంచమంతా విస్తరించడం ద్వారా శాంతిని బోధిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ హార్ట్‌ఫుల్‌నెస్ గైడ్ కమలేష్ డి పటేల్ - దాజీ, ప్రఖ్యాత వేద గురువు త్రిదండి చినజియర్ స్వామి, రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద తదితరులు పాల్గొన్నారు.