BJP Focus On Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్రంలో బీజేపీ ముందస్తుగానే ఎన్నికల కార్యాచరణ ప్రారంభించింది. అభ్యర్థుల ఎంపిక పూర్తయినందున మొదటి విడత ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ప్రధాని మోదీ రెండు విడతలుగా ప్రచార సభల్లో పాల్గొనగా అగ్రనేత అమిత్‌షా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడంలోనూ బీజేపీ ప్రత్యేక పంథాలో సాగింది.
ప్రధానంగా విజయావకాశాలను దృష్టిలో ఉంచుకుని కొత్తవారికి ప్రాధాన్యమిచ్చింది. ఇతర పార్టీల నేతలను చేర్చుకునేందుకు జాతీయ నాయకత్వమే స్వయంగా రంగంలోకి దిగింది. బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎంపీలతో పాటు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. ఒకటి మినహా అన్ని స్థానాల్లో లక్ష్యం మేరకు చేరికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లినట్లు పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు.
పార్లమెంట్ అభ్యర్థుల రెండో జాబితాకు బీజేపీ కసరత్తు- ఆశావహుల్లో నెలకొన్న ఉత్కంఠ
BJP MP Candidates List 2024 : టికెట్ల కేటాయింపులోనూ బీజేపీ అధిష్ఠానం సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంది. రెండు ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాల్లో గిరిజనుల్లో కీలకమైన ఇరు వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చింది. బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు మాజీ ఎంపీలను పార్టీలోకి చేర్చుకుని పోటీలో నిలిపింది. ఆదిలాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీని కాదని మాజీ ఎంపీ నగేశ్‌కు టికెట్ ఇవ్వగా మహబూబాబాద్ లోక్‌సభ స్థానంలో లంబాడాలకు ప్రాధాన్యమిస్తూ ఎంపీ సీతారాం నాయక్‌ను బరిలోకి దింపింది.