పర్యావరణానికి మేలు చేసే "భూతాల మేడ" ఇది! - ఓ కలెక్టర్ నిర్మించారు - ఎందుకో తెలుసా? - Awareness On Use of Eco Bricks
Awareness On The Use of Eco Bricks : ప్లాస్టిక్ భూతంతో మాననాళికి ఉన్న ముప్పు గురించి ఎంత ప్రచారం చేసినా.. వినియోగాన్ని మాత్రం పూర్తిస్థాయిలో అడ్డుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ భూతాన్ని అడ్డుకునేందుకు, ప్లాస్టిక్ ను మళ్లీ వినియోగించేందుకు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ చేపట్టిన ప్రయోగం అందరినీ ఆలోచింపజేస్తోంది. అదే "ఎకో బ్రిక్స్". ఆ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Collector Creating Awareness On The Use of Eco Bricks (ETV Bharat)
Bhadradri Collector Creating Awareness On The Use of Eco Bricks : "ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి హాని కదా.. ఎందుకు వినియోగిస్తున్నారు?" అని ఎవరినైనా అడిగితే చాలా మంది నుంచి వచ్చే ఒకే ఒక్కమాట "నేనొక్కడినే మారితే సరిపోతుందా ఏంటీ?" అని. ఇలా ఒక్కొక్కరుగా చూపించే నిర్లక్ష్యమే చివరకు ప్లాస్టిక్ భూతంగా మారి పర్యవరణాన్ని కబళించేలా చేస్తోంది. దశాబ్దన్నర క్రితం వరకు పెద్దగా వాడకం లేని నిషేధిత ఉత్పత్తుల వ్యర్థాలు.. ఇప్పుడు పల్లెలు, పట్టణాలు, గుట్టలు ఇలా తేడా లేకుండా అంతటా జమవుతున్నాయి. ఎక్కడ చూసినా వాటి జాడలే. కానీ ప్రజల్లో మాత్రం చైతన్యం శూన్యం.
ఈ పరిస్థితుల్లో.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్లాస్టిక్ పునర్వినియోగంపై చేస్తున్న ప్రయోగాలు, ప్రయత్నాలు అందరినీ ఆలోజింపచేస్తున్నాయి. మున్సిపాలిటీల్లో ప్లాంట్లు, పర్యావరణహిత ఇటుకల తయారీలో వ్యర్థాల వ్యాప్తికి అడ్డుగోడ కట్టాలని ఆయన ఆలోచిస్తున్నారు. ఈ ప్రయత్నం ప్రతీ జిల్లాలోనూ జరగాలని పర్యావరణ ప్రేమికులు ఆశిస్తున్నారు.
నామమాత్రపు తనిఖీలు :ప్లాస్టిక్ వ్యర్థాల తయారీ, విక్రయాలపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిస్తే చాలా వరకు సమస్య తీరుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే ప్లాస్టిక్ ఉత్పత్తులతో గుట్టుగా గోదాములను చూసి వదిలేసి మాకేంటి అనుకుంటే మాత్రం అసలుకే మోసం వస్తుంది. కొందరు నిషేధిత ఉత్పత్తుల రిటైల్ వ్యాపారాన్ని యథేచ్చగా సాగిస్తున్నారు. అధికారులు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని నగర, పురపాలికల్లో ప్లాస్టిక్ విక్రయాలు, వినియోగం ఇంకా పెరుగుతోంది.
వివాహాది కార్యాల్లో పెద్ద ఎత్తున వాడుతున్నా పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఆయా వ్యర్థాలు డంపింగ్ యార్డులతో పాటు డ్రైనేజీలను ముంచెత్తుతున్నాయి. ఈ కారణంగానే ఖమ్మం, మణుగూరులోని వివిధ కాలనీలను ఇటీవల వరద ముంచెత్తింది. ఒకసారి వాడి పారేసే కవర్లు, బాటిళ్లను వినియోగించకుండా ప్రజల్లో చైతన్యం పెంచితే ఫలితం ఉంటుంది.
బర్తన్ బ్యాంకులపై అవగాహన :శుభకార్యాలకు స్టీలు సామగ్రిని అందజేసే ‘బర్తన్’ బ్యాంకులను ఖమ్మంలో పలుచోట్ల ప్రారంభించారు. వీటిని అన్ని పట్టణాలు, నగరాల్లోని మిగతా వార్డుల్లో వీలైనన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేయాలి. బర్తన్ బ్యాంకుల వస్తువుల వినియోగం పట్ల కాలనీ వాసులకు అవగాహన కల్పించాలి. ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండే వ్యాపారులకు రాయితీ కల్పించాలి. స్వయం సహాయక సంఘాలకు ‘మహిళాశక్తి’ పథకం కింద జనపనార, వస్త్ర సంచుల తయారీ యూనిట్ల అవకాశం కల్పించాలి. వారి ఉత్పత్తులకు స్థానికంగా మంచి మార్కెటింగ్ కల్పిస్తే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.
ఉద్యమ స్థాయిలో చైతన్యం పెంచాలి :ఇల్లెందు పట్టణంలో రూ.10 లక్షలకు పైగా వెచ్చించి తెప్పించిన బయోమైనింగ్ యంత్రాన్ని ఇంకా వినియోగంలోకి తీసుకురాలేదు. దీనిపై దృష్టి పెట్టడమే కాదు, అన్ని పురపాలికల్లో ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు నెలకొల్పి ప్లాస్టిక్ పునర్వినియోగానికి ముందుడుగు వేయాలి. ప్రధాన ఆదాయ వనరుగా మలచి పర్యావరణాన్ని రక్షించాలి. ఖాళీ బాటిళ్లలో కవర్లను కుక్కి ఇటుకలుగా వాడే ‘ఎకో బ్రిక్స్’ తయారీపై ఉద్యమస్థాయిలో చైతన్యం పెంచాలి. ఇందుకు విద్యాలయాలు వేదికలుగా కావాలి. ఈ క్రతువు తమ ముఖ్య బాధ్యత అని పంచాయతీ, పట్టణ సిబ్బంది, పాలకవర్గాలు గుర్తెరిగేలా ఉన్నతాధికారులు చర్యలు చేపడితే మార్పు తప్పక వస్తుంది.