Bhadrachalam Ramayya Pattabhishekam 2024 : జగమేలే జనార్ధనుడు జానకమ్మను మనువాడిన దృశ్యాలు మది నిండా ఉండగా మరుసటి రోజునే అంగరంగ వైభవంగా పట్టాభిషక్తుడై భక్తకోటికి అభయమిచ్చాడు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలతో భద్రాచల మాఢవీధులు సర్వాంగ సుందరంగా మారగా నిత్యపూర్ణాహుతి అనంతరం దేవదేవుడు పల్లకిలో మిథిలా మండపానికి చేరుకున్నారు.
SRIRAMA NAVAMI 2024 :శ్రీరామ నామ స్మరణతో మిథిలా మండపం మార్మోగుతున్న వేళ సాగిన పట్టాభిషేక వేడుక ఆద్యంతం భక్తుల మదిని దోచింది. ఆలయ స్థానాచార్యులు, ప్రధాన అర్చకుల పర్యవేక్షణలో సాగిన విష్వక్సేన పూజ, పుణ్యహావచనం భక్తి భావాలు పంచింది. రామరాజ్యంలో ప్రజాశ్రేయస్సు వర్ధిల్లిన తీరు, పాలకులకు ఆదర్శంగా నిలిచేలా అయోధ్యను పరిపాలించిన తీరును వైదిక పెద్దలు కొనియాడారు. గోదావరి పుణ్య జలాలు భక్తులపై చల్లి శుభాశిస్సులు అందించారు.
నీరజాక్షి సీతమ్మతో కలిసి స్వామివారు రాజాధిరాజుగా సాక్షాత్కరించారు. భక్తరామదాసు తయారు చేయించిన ఆభరణాల విశిష్టతను వివరిస్తూ స్వామికి అలంకరించిన తీరు భక్తులకు పరమానందాన్ని కలిగించింది. ఖడ్గం చేతపట్టి, కిరీటాన్ని ధరించి, ఛత్ర చామరాలతో కొలువుదీరిన రాములోరిని చూసి భక్తజనం మురిసిపోయింది. వేద మంత్రోచ్ఛరణ మారుమోగుతుండగా సింహాసనాన్ని అధిష్టించిన రామచంద్రుడు భక్తకోటికి కొండంత అభయమిచ్చాడు.
భద్రాద్రి సీతమ్మకు కానుకగా త్రీడీ చీర - చూస్తే వావ్ అనాల్సిందే! - Making Video of 3D Saree