Karthika Masam Vana Bhojanam : కార్తిక మాసంలో వన భోజనాలు ఎంతో ప్రత్యేకం. ఆ సందడి కూడా ప్రారంభం అయిపోయింది. ప్రకృతి ఒడిలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి వనభోజనాలకు వెళ్లేందుకు ఎన్నో వ్యయప్రయాసలు ఓర్చుకుంటూ ఎక్కడెక్కడికో వెళుతూ ఉంటారు. కేవలం ఒక్కరోజు గడపడానికి అంత దూరం ఎందుకు వెళ్లాలి.. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోనే అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. అలాగే ప్రకృతి ప్రసాదించిన అందాలు సైతం ఉన్నాయి. అక్కడకు వెళ్లి వన భోజనం చేస్తే టైం సేవ్ అవుతుంది.. మళ్లీ వేగంగా ఏంచక్కా ఇంటికి వచ్చేయొచ్చు. కేవలం వనభోజనాలకు మాత్రమే కాందండోయ్.. వారాంతాల్లో కూడా ప్రశాంతంగా గడపడానికి వెళ్లవచ్చు. ఇప్పుడు ఆ ప్రాంతాలపై ఓ లుక్కేద్దాం. రండీ.
దూలపల్లి ప్రాంతం : దూలపల్లి ప్రాంతంలో ఎటూ చూసిన పచ్చదనమే కనిపిస్తోంది. వందల ఎకరాల్లో ప్రకృతి ప్రసాదించిన అడవులు ఉంటాయి. అక్కడే దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ ఉంటుంది. కానీ అకాడమీలోకి ప్రవేశం మాత్రం అందరికీ ఉండదు. కానీ ఆపక్కనే ఖాళీ ప్రదేశంలో కార్తిక వనం అభివృద్ధి చేశారు. అక్కడకు వెళ్లి ప్రశాంతంగా ప్రకృతి ఒడిలో ఆనందంగా గడపవచ్చు. నెమళ్లు పురివిప్పి అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి.
శిల్పారామం : ఉప్పల్, మాదాపూర్ శిల్పారామాల్లో గడిపేందుకు అనువుగా తీర్చిదిద్దారు. ఇక్కడకు వారాంతరాల్లో నగరవాసులు పెద్దఎత్తున వస్తారు.
హరిణ వనస్థలి జాతీయపార్క్ : విజయవాడ జాతీయ రహదారి మార్గంలో వనస్థలిపురంలో ఉంటుంది. ఇక్కడ జింకలు, ఇతర జంతువులను కూడా వీక్షించవచ్చు. కుటుంబంతో కలిసి భోజనాలు చేయవచ్చు.. ఉండేందుకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి. ఈ జాతీయ పార్క్‌కు ఆదివారం పూట వెళ్లేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు.
ఆయుష్‌వనం : బహుదూర్‌పల్లిలో 50 ఎకరాల విస్తీర్ణంలో ఆయుష్ వనం ఉంది. అక్కడ చెట్లు, పచ్చదనంతో ఆహ్లాదకరంగా అభివృద్ధి చేశారు. ఇక్కడ కుటుంబంతో గడిపేందుకు తగిన వసతులు ఉన్నాయి.
నందనవనం : వరంగల్ రహదారిపై నారపల్లిలోని భాగ్యనగర్ నందనవనం ప్రకృతి ప్రేమికులను ఆహ్వానిస్తోంది. ఇక్కడకు వారాంతరాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది.
బొటానికల్ గార్డెన్ : ఈ గార్డెన్ కొండాపూర్‌లో ఉంది. ఇక్కడకు బృందంగా వెళితే మాత్రం తప్పనిసరి అనుమతి అవసరం. ఔషధ మొక్కలకు నిలయం.
సంజీవని వనం : నాగార్జున సాగర్ రహదారి మార్గంలో బీఎన్ రెడ్డి నగర్ తర్వాత గుర్రంగూడ ప్రాంతంలో ఉంది. వనాల మధ్య భోజనాలు చేయవచ్చు.
జూ పార్క్ : చుట్టూ చెట్లు, మధ్యలో జంతువుల ఎన్క్లోజర్లు ఉంటాయి. ఇక్కడ పిల్లలు ఎక్కువగా ఆస్వాదిస్తారు. వారాంతరాల్లో జంతు ప్రేమికులు ఎక్కువగా వెళతారు. కార్తిక మాసాల్లో ఈ జూ పార్క్ ఖాళీగా ఉండదు.
కన్హా శాంతివనం : బెంగళూరు జాతీయ రహదారి నుంచి 8 కి.మీ. లోపలికి వెళితే ఉంటుంది. వందల రకాల మొక్కలు, వనాలు ఇక్కడ ఉన్నాయి. అరుదైన, అంతరించే దశలో ఉన్న మొక్కలు, ఔషధ మొక్కలు, కొబ్బరి, అరటి తోటలను చూడవచ్చు. ధ్యానం చేసేవారికి వసతి సౌకర్యాన్ని కూడా కల్పిస్తారు. కార్తిక వనభోజనాలకు ఇక్కడకు వెళ్లవచ్చు.