Banjara traditional Craft Artist Naveen Story :ఉన్నత చదువులు చదివి కార్పొరేట్ సంస్థలో ఉద్యోగాలు చేయాలని కలలు కనే నేటి యువ తరానికి ఈ యువకుడు పూర్తిగా భిన్నం. మన ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలన్న ఆసక్తి, నేటితరం యువతలో చాలా తక్కువ. అలాంటిది ఓ వైపు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా చదువును కొనసాగిస్తూనే, బంజారాల ఆచారాలపై అవగాహన కల్పిస్తున్నాడు ఈయువకుడు. తన సుదీర్ఘ సేవలకు ప్రతిఫలంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్ నేష్నల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ను కైవసం చేసుకున్నాడు.
పేదింటి పెన్సిల్ అర్టిస్ట్ - డ్రాయింగ్‌తో చిత్రాలకు ప్రాణం పోస్తున్న యువకుడు - pencil artist ganesh
మెదక్ జిల్లా సంగాయిగుడి తాండకు చెందిన నవీన్‌కు చిన్నప్పటి నుంచి చదువుతో పాటు లంబాడ ఆచారాలు, సంప్రదాయాలు అంటే ఏంతో ఆసక్తి. నిరుపేద కుటుంబానికి చెందిన ఈ యువకుడు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సీటీలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మొదటి సంవత్సరం పూర్తిచేశాడు. ప్రపంచంలోనే నగదును వస్త్రాలతో పాటుగా ధరించేది బంజారా మహిళలు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఆచారం కాస్త సన్నగిల్లుతోంది. అందుకే ఫైన్ ఆర్ట్స్ కోర్సు చదివి, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నానని చెబుతున్నాడు నవీన్.
తమ వస్త్రధారణను కాపాడే ప్రయత్నంలోనే, ప్రపంచానికి తన వంతుగా బంజారాల చరిత్ర చెప్తానంటున్నాడు నవీన్. దీని కోసం నాలుగు సంవత్సరాలు కష్టపడి పూర్వకాలం నాటి నాణేలను సేకరించాడు. దాదాపు ఆరు నెలల పాటు బంజారాల గుంగటంను తయారు చేశాడు. ఈ గుంగటాన్ని 20 అడుగుల పొడవుతో, 2 నుంచి 25 పైసల నాణేలతో తయారు చేశాడు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తే బంజార బిడ్డలకు చేతి అల్లికలు, లంబాడ వస్త్రాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తానంటున్నాడు ఈ తండా యువకుడు.
బంజారా వస్త్రాల గురించి, వారి వస్త్రాలపై ఉండే నగదు సంప్రదాయాలను సమాజానికి వివరిస్తున్నాడు నవీన్. దారాలతో బొమ్మలను గీస్తూ అందరినీ అబ్బుర పరుస్తున్నాడు. పలు మార్లు అవమానాలకు గురైనా, తమ వేషధారణను రాబోయే తరాలకు చాటిచెప్పడానికి శ్రమిస్తున్నాడు. రాబోయే రోజుల్లో బంజారా కళపై అవగాహన పెంపోందించేందుకు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుంటానని చెప్తున్నాడు.