CM Revanth on Various Projects in Rajanna Sircilla : రాజన్న సిరిసిల్ల జిల్లాపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఆయన వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చారు. ముందుగా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా వేములవాడకు చేరుకున్న ముఖ్యమంత్రికి స్థానిక నేతలు ఘనస్వాగతం పలికారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసిన సీఎంకు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతించారు.
ఆలయ ప్రాంగణానికి చేరుకున్న రేవంత్‌రెడ్డి ముందుగా ప్రధాన ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. శ్రీ రాజరాజేశ్వర స్వామికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ గణపతి, రాజరాజేశ్వరి అమ్మవార్లను దర్శించుకున్నారు. ధ్వజస్తంభం వద్ద కోడె మొక్కులు చెల్లించుకున్నారు. పూజల అనంతరం ముఖ్యమంత్రి, మంత్రులకు ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం స్థల పురాణాన్ని పురోహితులు వివరించారు. అనంతరం దేవాలయ అభివృద్ధి పనుల వివరాలను అధికారులు వివరించారు.
రూ. 694.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు : ప్రజాపాలన తొలి ఏడాదిలోనే మొత్తం రూ.694.50 కోట్లతో వేములవాడలో వివిధ అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. 76 కోట్ల రూపాయలతో చేపట్టే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు ధర్మగుండం వద్ద ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. రూ.35.25 కోట్లతో చేపట్టే అన్నదానం సత్రం నిర్మాణ పనులు, రూ. 45 కోట్లతో చేపట్టే మూల వాగు బ్రిడ్జి నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. 166 కోట్ల రూపాయలతో చేపట్టే వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. రూ.50 కోట్లతో నూలు డిపో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
రూ.52 కోట్లతో కొనరావుపేట మండలంలో చేపట్టే హై లెవెల్ బ్రిడ్జి పనులు, రూ. 3 కోట్లతో నిర్మించే డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.235 కోట్లతో 4వేల 696 మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పనులకు భూమి పూజ చేశారు. మేడిపల్లి మండలంలో జూనియర్ కళాశాల రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. సిరిసిల్లలో రూ. 26 కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయ భవనం, వేములవాడలో కోటి 45 లక్షల రూపాయలతో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనాన్ని, రూ. 4 కోట్ల 80 లక్షలతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు.