Bangalore Rave Party Accused Lankapalli Vasu :ఇతని పేరు లంకపల్లి వాసు. విజయవాడ ఆంజనేయవాగు సమీపంలోని బ్రహ్మంగారి మఠం వీధిలో నివాసం ఉంటాడు. వాసుది సాధారణ కుటుంబమే. తల్లి దోసెలు అమ్ముతారు. తండ్రి మరణించాడు. వాసుకు ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య. చిన్నప్పటి నుంచి మంచి క్రికెటర్‌గా ఎదగాలన్నది అతని లక్ష్యం. ఆటపై అభిమానమే అతడిని బుకీగా మార్చింది. క్రికెట్, హాకీ, కబడ్డీ ఇలా ప్రధాన క్రీడల బెట్టింగుల్లో బుకీగా వ్యవహరించేవాడు.
బెంగళూరు, చెన్నై, ముంబయి, విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి చిత్తూరు, కర్నూలు, తదితర ప్రాంతాల నుంచి బెట్టింగులు నిర్వహించేవాడు. ఇలా పెద్ద సంఖ్యలో పలు రాష్ట్రాల్లో బెట్టింగ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. విజయవాడలోనే దాదాపు 150కి పైగా బెట్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత వ్యాపారాలను విస్తరించి హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో పబ్‌లు నిర్వహిస్తున్నాడు. వాసు భార్య, ఇద్దరు కుమార్తెలు విజయవాడలోనే ఉంటారు. అతను మాత్రం ఒకటి, రెండు రోజులు వచ్చి వెళ్తుంటాడు. చుట్టుపక్కల వారు అడిగితే దుబాయ్, బెంగళూరు, మలేసియాలో పని చేస్తున్నానని చెప్పి నమ్మించేవాడు.
ఎక్కడికి వెళ్లినా విమానాలలోనే తిరిగేవాడు. ఎక్కడకి వెళ్లినా అక్కడ విమానాశ్రయంలో లగ్జరీ కార్లు, అనుచరులతో హడావుడి చేసేవాడు. రూ. కోటి విలువైన విలాసవంతమైన కార్లు నాలుగు వరకు ఉన్నాయి. విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తదితర ప్రాంతాల్లో భారీగా విల్లాలు, ఇళ్లు కొన్నాడు. విజయవాడలోని వైవీరావు ఎస్టేట్ వద్ద భారీగా డబ్బులు వెచ్చించి విల్లా నిర్మించాడు. ఓ కార్పొరేటర్‌కు చెందిన భవనాన్ని రూ. కోటి వెచ్చించి కొనుగోలు చేశాడు.