Bandlaguda Laddu Auction 2024 : హైదరాబాద్ బండ్లగూడజాగీర్‌లో గణేశ్ లడ్డూ వేలం పాట రికార్డు సృష్టించింది. ఈ ప్రాంతంలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో నిర్వహించిన వేలం పాటలో లడ్డూ ఏకంగా రూ.1.87 కోట్లు పలికింది. గతేడాది ఇదే ప్రాంతంలో నిర్వహించిన వేలంలో రూ.1.20 కోట్లకు లడ్డూను దక్కించుకోగా, ఈసారి దానిని మించి ధర పలకడం విశేషం. ఈ ఏడాది అత్యధికంగా రూ.1.87 కోట్లకు దక్కించుకోవడంతో గతేడాది రికార్డు బ్రేక్ అయినట్లయింది.
గత 11 ఏళ్లుగా కీర్తి రిచ్మండ్ విల్లాలో గణేశ్ ఉత్సవాలు :11 ఏళ్ల నుంచి కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో గణేశ్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పదకొండో రోజున నిమజ్జనం చేస్తారు. ఆ రోజునే ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి లడ్డూ వేలం పాట మొదలుపెడతారు. అయితే ఈ వేలం పాటలో విల్లాలో ఉన్నవారు మాత్రమే పాల్గొంటారు. లడ్డూ ఎవరికి దక్కినా అందరూ కలిసి సేవా కార్యాక్రమాల కోసం ఆ డబ్బును వినియోగిస్తారు. ఒక్క రూపాయి కూడా వ్యక్తిగత అవసరాల కోసం వాడరు.
అ'ధర'హో : నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో గణేశ్ ఉత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో వేలం పాటలు జరిగాయి. షాద్‌నగర్‌లో ఆనంద్‌నగర్ పార్కులో ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో మనోజ్‌కుమార్ పెద్ద లడ్డూను రూ.5.35 లక్షలకు సొంతం చేసుకోగా ఆయన భార్య కలకొండ కీర్తన రూ.2.35 లక్షలకు చిన్న లడ్డూను దక్కించుకున్నారు. ప్రశాంత్‌నగర్‌లో మండపంలోని లడ్డూను సాయిప్రసాద్‌రెడ్డి రూ.1,11,116కు చేజిక్కించుకున్నారు. శంకర్‌నగర్‌లో ఎం.రమేశ్ గౌడ్ దంపతులు రూ.లక్షా 45 వేలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. బృందావన్‌కాలనీలో పులిమామిడి ఒకలక్షా తొమ్మిదివేల రూపాయలకు పాడి లడ్డూ కైవసం చేసుకున్నారు.