Bag Burden on Telangana School Children : మీ పిల్లల పుస్తకాల బ్యాగ్ బరువు మీరెప్పుడైనా చూశారా?, ఇటీవల ఏమైనా వెన్నునొప్పి వస్తోందని ఫిర్యాదు చేశాడా.. ఓసారి గుర్తు తెచ్చుకోండి. అలా చెబితే మాత్రం సాధారణ నొప్పిగా భావించి లైట్‌గా తీసుకోకండి. రాబోయే రోజుల్లో అదే పెద్ద సమస్యగా మారవచ్చు.
తల్లిదండ్రుల ఆందోళన : ఉదయం గడియారంలో ముల్లు ఎనిమిది మీదికొచ్చందంటే విద్యార్థులు బడి సంచులు భుజాన వేసుకుని భారంగా నడవడం మనం రోజు చూస్తునే ఉంటాం. మెడ వంగిపోతుందా ఏంటి అనేంత బరువుంటుందా పుస్తకాల సంచి. పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించే బ్యాగు బరువుపై తల్లిదండ్రులు ఇకనుంచైనా దృష్టి సారించాల్సిందే.
బ్యాగ్ ఎంత బరువుండాలి : పిల్లల శరీర బరువులో బ్యాగు బరువు 10 శాతం కంటే ఎక్కువగా ఉండొద్దనే విషయమై విద్యావేత్తలు అనేక మార్లు సూచించియి. ప్రభుత్వాలు నియమించిన విద్యా కమిటీలు ఆ మేరకు ప్రతిపాదనలు చేసినా ఆచరణలో మాత్రం సాధ్యపడటం లేదు. ఏటా పాఠశాలల ప్రారంభంలో కొద్ది రోజులు దీనిపై చర్చ జరగడమే తప్ప ఫలితం ఉండటం లేదని విద్యానిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆదేశాలున్నా అమలు కావట్లేదు :జాతీయ విద్యాకమిషన్-2005, విద్యార్థుల స్కూల్ విధానంలో పుస్తకాల సంచిపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. నెలలో ఒక్క రోజు నో బ్యాగ్ డే అమలు చేయాలని చెప్పారు. రాష్ట్ర విద్యాశాఖ జాతీయ విద్యాకమిషన్ సూచనలను ఆమోదించింది. ప్రతి నెల మూడో శనివారం అమలు చేయాలని నిర్ణయించింది. కానీ చాలా పాఠశాలల్లో దీని ఆచరణ కొరవడింది.
NEP-2020 తెలిపిన ప్రకారం బ్యాగు బరువు వివరాలు (ETV Bharat) ఇతర రాష్ట్రాల్లో విభిన్నంగా :కానీ చాలా వరకు ఇతర రాష్ట్రాలు మాత్రంనో బ్యాగ్ డే విధానాన్ని పాటిస్తున్నాయి. పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌లో మొదటి, మూడో శనివారాల్లో ఈ పద్ధతి అమలు చేస్తున్నారు. తమిళనాడులో ఫిబ్రవరి 28న పుస్తక దినోత్సవాన్ని ‘నో బ్యాగ్ డే’ నిర్వహిస్తున్నారు. కర్ణాటక, మణిపూర్, రాజస్థాన్‌లలోనూ ఒక శనివారం విద్యార్థులు పుస్తకాలను దూరంగా ఉంచే విధానాన్ని ప్రకటించారు.
చిన్న పిల్లలపై అధిక బరువు పడితే భవిష్యత్తులో నాడీ వ్యవస్థపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. మెడ, నడుము, భుజాల నొప్పులు వస్తాయి. బ్యాగు ఒకే వైపు వేసుకోవడం వల్ల కండరాల నొప్పి, ఛాతిమీద తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. వెన్నెముకలో సమస్యలు ఏర్పడి సర్వైకల్ స్పాండిలోసిస్ ఏర్పడుతుంది. వెన్నెముక కింది భాగంలో లార్డోసిస్, స్పోలియోసిస్ సమస్యలు ఎదిగే పిల్లల్లో ఎముకల పెరుగుదల కూడా తగ్గుతుంది - డాక్టర్ అజహర్ అహ్మద్, పీహెచ్‌సీ, అడవిదేవులపల్లి