ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమెరికాలోని యూజీ కోర్సుల్లో చేరాలనుకుంటున్నారా? ఈ సలహాలు, సూచనలు మీకోసమే! - Awareness on UG Courses in America - AWARENESS ON UG COURSES IN AMERICA

Awareness on UG Courses in America: ఉన్నత చదువులు విదేశాలలో అభ్యసించాలనేది ఎంతో మంది విద్యార్థుల కల. అయితే అందుకు ఏ విధమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలనేది చాలా మందికి సందేహం. అలాంటి వారికి విజయవాడలో జరిగిన సదస్సు వివరణ ఇచ్చింది. ముఖ్యంగా అమెరికాలోని యూజీ కోర్సుల్లో చేరాలంటే ఎలాంటి అవకాశాలు ఉంటాయి?, వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే విషయాలను సంస్థల ప్రతినిధులు విద్యార్థులతో ముచ్చటించారు. మరీ, మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ కథనం మీ కోసం.

Awareness_on_UG_Courses_in_America
Awareness_on_UG_Courses_in_America (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 19, 2024, 4:08 PM IST

అమెరికాలోని యూజీ కోర్సుల్లో చేరాలనుకుంటున్నారా? ఈ సలహాలు, సూచనలు మీకోసమే! (ETV Bharat)

Awareness on UG Courses in America:ప్రపంచంలోని అన్ని దేశాలతో పొలిస్తే అమెరికాలో విద్యను అభ్యసించడానికి భారత విద్యార్థులు మక్కువ చూపిస్తుంటారు. దీంతో అగ్రరాజ్యానికి వెళ్లి చదవాలనే ఆకాంక్ష తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో ఏటేటా పెరుగుతోంది. అక్కడ ఉన్న సౌకర్యాలు, విస్తృత అవకాశాలు, గరిష్ట వేతనాలు, ప్రపంచ ప్రమాణాలే ఇందుకు కారణం. అందుకే అమెరికాలోని మేటి విశ్వవిద్యాలయాలు తెలుగు రాష్ట్రాల వైపు ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి.

అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలో ఉన్న కోర్సులు, అవకాశాలు, ఉపకారవేతనాల గురించి ఆయా సంస్థల ప్రతినిధులు విజయవాడలో ఇటీవల తెలుగు విద్యార్థులకు అవగాహాన కల్పించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థులు యూజీ కోర్సులు చేసేందుకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని సూచించారు. అక్కడి విద్యా సంస్థలు ఆన్‌లైన్‌లో నిర్వహించే పరీక్షల్లో అర్హత సాధించగలిగితే భవిష్యత్తుకు ఢోకా ఉండబోదని చెబుతున్నారు.

ప్రపంచంలోని మొదటి పది, 200, 500 విశ్వవిద్యాలయాల జాబితాలో అగ్రరాజ్యానిదే ఆధిపత్యం. సగం కంటే ఎక్కువ సంస్థలు ఆ దేశానివే ఉంటున్నాయి. ఆ దేశం ఆకర్షిస్తోన్న విదేశీ విద్యార్థుల్లో ప్రథమ స్థానం మన దేశానిదే. అమెరికాలో చదువుతోపాటు ఉపాధి అవకాశాలు చాలానే ఉండటం దీనికి కారణం. కానీ ప్రస్తుతం ఆర్థిక మాంద్యం కొనసాగుతున్న దృష్ట్యా విద్యార్థులు కొంత వెనకాడుతున్నారని, ఇది స్వల్పకాలమే తప్ప దీర్ఘకాలం కాదని విద్యావేత్తలు చెబుతున్నారు.

జీఎంఆర్‌ ఐటీ వేదికగా స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ పోటీలు - ఆధునిక సాంకేతికతను రూపొందించిన విద్యార్థులు

మంచి నైపుణ్యాలు గల విద్యార్థులకు అమెరికా విశ్వవిద్యాలయాలలో అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు నిపుణులు. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్‌ టెక్నాలజీలో 2వేల 300 కంటే ఎక్కువ డిగ్రీలను అందించే 340కి పైగా గుర్తింపు పొందిన అమెరికన్ సంస్థలు ఉన్నాయని తెలిపారు. వీటి ద్వారా విద్యార్థులు కోరుకునే ఏరోస్పేస్ ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌తో పాటు పలు రంగాలలో నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చని చెబుతున్నారు.

అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు చేయాలనుకుంటే ఇంటర్మీడియట్‌ తర్వాత తగిన ప్రణాళికతో జీఆర్​ఈ, టోఫెల్‌ పరీక్షలు రాయాలి. పరీక్షల్లో సాధించిన స్కోరు ప్రకారం విశ్వవిద్యాలయాలు ప్రవేశ అవకాశాలు కల్పిస్తాయి. స్కాలర్‌షిప్‌ కోసం ఆయా విశ్వవిద్యాలయాలకు దరఖాస్తులు చేసుకోవాలి. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఏడాదికి 25వేల నుంచి 30వేల యూఎస్‌ డాలర్ల ఉపకార వేతనాలు ఇస్తున్నారు. అలాగే పార్ట్‌టైం పనులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు.

ఎన్నో ఆర్థిక సమస్యలు అధిగమించి పీహెచ్​డీ - కర్ణాటక గవర్నర్​ నుంచి పట్టా అందుకున్న యువకుడు

విద్యార్థులు ఎంచుకున్న కోర్సుపై యాజమాన్యం దృష్టి సారిస్తుంది. ఎంచుకున్న కోర్సులు చదవడానికి సరైన వాళ్లేనా? అందులో రాణించగలరా? అనేవి తెలుసుకుంటారు. మూడు, నాలుగు విద్యా సంవత్సరాల పరీక్షల్లో వారు సాధించిన మార్కుల స్కోర్లను కూడా చూస్తారు. విద్యా విషయాలతోపాటు ఇతర రంగాల్లోని ప్రతిభ ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. కాబట్టి ఎంపిక చేసుకున్న కోర్సులో సీటు వస్తే తప్పకుండా చేరాలనుకున్న సంస్థలనే ఎంచుకోవాలంటున్నారు నిపుణులు.

గతంలో శాట్‌ పరీక్షలో ప్రతిభ కనబర్చకపోతే అమెరికా యూనివర్శీటీలలో చదివే అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు 90 శాతానికి పైగా వర్శిటీలు 2027 సంవత్సరం వరకు శాట్‌ అవసరం లేదని పేర్కొనడం మంచి పరిణామం. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని విద్యావేత్తలు కోరుతున్నారు.

"యూజీ కోర్సులు చేయాలనుకుంటే పదో తరగతి, ఇంటర్మీడియట్‌ నుంచే విద్యార్థులు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి. అక్కడి విద్యా సంస్థలు ఆన్‌లైన్‌లో నిర్వహించే పరీక్షల్లో అర్హత సాధించగలిగితే భవిష్యత్తుకు ఢోకా ఉండబోదు. మంచి నైపుణ్యాలు గల విద్యార్థులకు అమెరికా విశ్వవిద్యాలయాలలో అవకాశాలు మెండుగా ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్‌ టెక్నాలజీలో 2వేల 300 కంటే ఎక్కువ డిగ్రీలను అందించే 340కి పైగా గుర్తింపు పొందిన అమెరికన్ సంస్థలు ఉన్నాయి. వీటి ద్వారా విద్యార్థులు కోరుకునే ఏరోస్పేస్ ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌తో పాటు పలు రంగాలలో నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం." - వివేకానందమూర్తి, మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఇన్విక్టా సంస్థ

ABOUT THE AUTHOR

...view details