Telangana Singapore Investments :సెమీ కండక్టర్ పరిశ్రమలో కీలక పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ రాష్ట్రం మరో ముందడుగు వేసింది. తెలంగాణలో ఉన్న అవకాశాలు, ఆధునిక మౌలిక సదుపాయాలు, అనుకూలమైన విధానాలు సింగపూర్ పారిశ్రామిక వేత్తలను ఆకర్షించాయి. సింగపూర్ భాగస్వామ్యం తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఉద్యోగాల కల్పనతో పాటు, ఆర్థికాభివృద్ధికి దోహద పడనుంది. మంత్రి శ్రీధర్ బాబు సింగపూర్‌లో సెమీ కండక్టర్ పరిశ్రమ అసోసియేషన్‌తో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఏఎస్ఐఏ ఛైర్మన్ బ్రియాన్ టాన్, వైస్ ఛైర్మన్ టాన్ యూ కాంగ్, సెక్రటరీ సి.ఎస్.చుహ తదితర ప్రతినిధులతో రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు.
భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు :తెలంగాణలో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులను మంత్రి శ్రీధర్ బాబు వారికి వివరించారు. రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక వాతావరణం, ప్రపంచ పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను మంత్రి తెలియజేశారు. సెమీ కండక్టర్ పరిశ్రమను రాష్ట్రానికి తీసుకు రావడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలు భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు సహకరిస్తాయని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు.