Asha Workers Protest In Koti Hyderabad : హైదరాబాద్లోని కోఠిలోని డీఎంఈ కార్యాలయం గేటు ముందు ఆశావర్కర్లు ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం రూ.18వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆశావర్కర్లు పెద్ద ఎత్తున రోడ్డుపై బైటాయించారు. దీంతో డీఎంఈ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు, ఆశాలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కార్యాలయం లోనికి తోసుకొని వెళ్లేందుకు ఆశాలు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సీఐపై చేయిచేసుకున్న ఆశావర్కర్ : ఓ ఆశా వర్కర్ సుల్తాన్ బజార్ సీఐ శ్రీనివాస్ చారిపై చేయి చేసుకుంది. ఆశాలకు లెప్రెసీ, పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు చెల్లించిన తర్వాతనే కొత్త సర్వేలు చేయించాలని ఆశలు కోరారు. వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముందు అనేక సార్లు నిరసన చేపట్టినా పట్టించుకోవడం లేదని ఆశలు ఆరోపించారు. డిసెంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లేప్రసి సర్వే చేయాలని ఆశాలకు జిల్లా అధికారులు చెప్తున్నారని వెంటనే లెప్రసీ సర్వే కోసం ట్రైనింగ్ కూడా ప్రారంభించారని తెలిపారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు.