BUS Fire Accident In Mahabubnagar: జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సు పూర్తిగా దగ్ధమైంది. తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి 1.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపోనకు చెందిన ఆర్టీసీ లగ్జరీ బస్సు, ఆదివారం రాత్రి 12 గంటలకు హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ నుంచి ప్రయాణికులతో బయలుదేరింది.
ఢీకొన్న బస్సు, డీసీఎం : జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి మలుపు వద్దకు చేరుకోగానే సరకు రవాణా వాహనం డీసీఎం యూటర్న్ తీసుకునేందుకు ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు, డీసీఎంను ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపు తప్పి కుడివైపు రోడ్డు కిందకు దూసుకెళ్లింది. డ్రైవర్, పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన మిగతా ప్రయాణికులు, అద్దాలు పగులగొట్టుకుని బయటకు వచ్చారు. తీవ్రంగా గాయపడిన వారిని కాపాడే ప్రయత్నం చేశారు.
ప్రమాదంలో బస్సు దగ్ధం :విషయం తెలుసుకున్నపోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అక్కడి ప్రయాణికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఈలోగా బస్సులో మంటలు చెలరేగి, చూస్తుండగానే తీవ్రమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 2.30 గంటల వరకు బస్సు పూర్తిగా దగ్ధమైంది. 108 సిబ్బంది క్షతగాత్రులను మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులు అప్రమత్తమై బస్సు నుంచి బయటకు రాకపోతే అంతా అగ్నికి ఆహుతయ్యే వారన్న ఆందోళన వ్యక్తమైంది.