మళ్లీ వైఎస్సార్సీపీ 'బంటులకే' పట్టం - చాకచక్యంగా వ్యవహరించిన సీఎస్ జవహర్ రెడ్డి ECI Appoints IPS Officers in Andhra Pradesh :కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా బదిలీ వేటు వేసిన ఎస్పీల స్థానంలో కొత్తవారిని నియమించే క్రమంలోనూ సీఎస్ తన ఏకపక్ష ధోరణిని, ఎన్నికల్లో వైఎస్సార్సీపీకు ఎలాగైనా మేలు చేయాలన్న తపనను బయటపెట్టారు. ఇందుకు ఆయన పంపిన జాబితానే నిదర్శనం.
నెల్లూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ : జాబితాలో నెల్లూరు ఎస్పీగా నియమితులైన ఆరిఫ్ హఫీజ్, ప్రకాశం ఎస్పీగా నియమితులైన గరుడ్ సుమిత్ సునీల్ అత్యంత వివాదాస్పదులు. నెల్లూరు ఎస్పీగా నియమితులైన ఆరిఫ్ హఫీజ్ 2021 జూన్ నుంచి మొన్న జనవరి వరకూ గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేశారు. అక్కడున్నంత కాలం పూర్తిగా వైఎస్సార్సీపీకు అనుకూలంగా వ్యవహరించారు. ఆ పార్టీ నాయకులు చెప్పినట్లే నడుచుకున్నారు.
మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై వైఎస్సార్సీపీ గూండాలు ఇనుపరాడ్లు, కర్రలు, కత్తులు, రాళ్లతో దాడికి తెగబడి విధ్వంసం సృష్టిస్తే ఒక్కరంటే ఒక్కర్నీ అరెస్టు చేయలేదు. దాడి దృశ్యాల్లో నిందితులందరి ముఖాలు సీసీ కెమెరాల్లో కనిపిస్తున్నా వారి జోలికి వెళ్లలేదు. తేలికపాటి సెక్షన్ల కింద కేసు పెట్టేసి మమ అనిపించేశారు. కొద్దిమందికి 41ఏ నోటీసులిచ్చి సరిపెట్టేశారు. దాడికి కుట్ర చేసిన వారిని నిందితులుగానే చేర్చలేదు. చంద్రబాబు నివాసంపైకి అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి జోగి రమేష్ వందల మందితో దండయాత్రగా వెళ్లి దాడి చేస్తే నిందితుల్ని అరెస్టు చేయలేదు. తిరిగి ప్రతిపక్ష నేతలపైనే ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టారు.
జగన్ భక్త అధికారులకు చెంపపెట్టు - ఊడిగం చేస్తే ఉద్యోగాలు ఊడతాయ్ - Transferred IAS and IPS Officers
దళితుడైన బియ్యం వ్యాపారి హత్య కేసులో నిందితులైన వైఎస్సార్సీపీ నాయకులు అధికార పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కళ్ల ముందే తిరుగుతున్నా వాళ్లనూ అరెస్టు చేయలేదు. అమరావతి ఉద్యమం 1,200 రోజులకు చేరుకున్న సందర్భంగా రాజధాని రైతులకు సంఘీభావం తెలిపి తిరిగి వస్తున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై రాళ్లు, కర్రలతో దాడి చేసి బీభత్సం సృష్టించినవారిని పోలీసులు నియంత్రించలేదు. దాడికి పాల్పడ్డవారిని ఎవర్నీ అరెస్టు చేయలేదు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి విడదల రజిని కార్యాలయంపై అల్లరిమూకలు రాయి విసిరితే రాత్రికి రాత్రి స్పందించేసి 30 మందిని అరెస్టు చేశారు. ఘటనతో సంబంధం లేని వారినీ అదుపులోకి తీసుకున్నారు. ఏడేళ్లలోపు శిక్ష పడే అవకాశమున్నా కేసు అయినప్పటికీ అరెస్టు చేసి కోర్టు ముందుంచారు. ఇలాంటి అధికారిని నెల్లూరు లాంటి కీలకమైన జిల్లాలో ఎస్పీగా నియమించడమేంటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ప్రకాశం ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ : ప్రకాశం ఎస్పీగా నియమితులైన గరుడ్ సుమిత్ సునీల్ విశాఖ కమిషనరేట్‌లో శాంతిభద్రతల విభాగం డీసీపీగా పని చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు చెప్పారని అడ్డగోలుగా వ్యవహరించారు. 2022 అక్టోబరులో విశాఖలో పర్యటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై గరుడ్ సుమిత్ సునీల్ జులుం ప్రదర్శించారు. పవన్ తన వాహనంలో నిలుచుని ప్రజలకు అభివాదం చేస్తుండగా ఆ కారుపైకి ఎక్కిన సునీల్ జనాలకు కనబడొద్దని, కారులోనే కూర్చోవాలని తీవ్రంగా ఒత్తిడి చేశారు. పవన్ కల్యాణ్ చేతులు పట్టుకుని అణిచేశారు.
"ఒక ఐపీఎస్ అధికారై ఉండి ఇలా ప్రవర్తిస్తారా? గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశంతో నన్ను రెచ్చగొట్టేందుకే ఇలా చేశారంటూ" అప్పట్లో జనసేనాని వ్యాఖ్యానించారు. ఆయన్ను విశాఖపట్నంలో పర్యటించకుండా నోవోటెల్ హోటల్‌కే పరిమితమయ్యేలా చేశారు. అధికార పార్టీ నాయకుల అనుచిత వ్యాఖ్యలపై నిరసన తెలిపే క్రమంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తి విశాఖ విమానాశ్రయంలో మంత్రి రోజా వాహన శ్రేణిపై చెప్పులు విసిరితే ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై హత్యాయత్నం సెక్షన్లు పెట్టారు. ఘటనాస్థలంలో లేని వారినీ కేసుల్లో ఇరికించారు. అర్ధరాత్రి ఇంటింటికీ వెళ్లి వెంటాడి వేటాడి మరీ వందమందికి పైగా జనసేన కార్యకర్తల్ని అరెస్టు చేశారు. అలాంటి అధికారిని ప్రకాశం ఎస్పీగా నియమించారు.
అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ : అనంతపురం ఎస్పీగా నియమితులైన అమిత్ బర్దర్‌కూ వైఎస్సార్సీపీ అనుకూలంగా పని చేస్తారన్న ముద్ర ఉంది. 2020 నుంచి 2022 ఏప్రిల్ వరకూ శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి మొన్న జనవరి నెల వరకూ సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగం ఎస్పీగా పని చేశారు. ఎక్కడైనా వైఎస్సార్సీపీ నాయకులు చెప్పిందే చట్టమన్నట్లుగా పని చేశారు. అలాంటి అధికారిని ఎన్నికల వేళ అనంతపురం ఎస్పీగా నియమించటం వివాదాస్పదమవుతోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక అధికారుల్ని బదిలీ చేసేది ఎన్నికల సంఘమే అయినా బదిలీ అయినవారి స్థానంలో నియమించేందుకు ముగ్గురి పేర్లతో ప్రతిపాదనలు పంపించాల్సింది ప్రధాన కార్యదర్శే. అక్కడే జవహర్‌రెడ్డి తన చాతుర్యాన్ని, అధికారపార్టీపై అంతులేని విధేయతను ప్రదర్శిస్తున్నారు. ఈసీ కళ్లకే గంతలు కడుతున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం కొరడా - ప్రతిపక్షాల అణచివేత, నిబంధనల పాతరకు ఫలితం! - IAS And IPS Officers Transfers
అనంతపురం జిల్లా ఎస్పీ పోస్టు కోసం ఆర్.గంగాధర్‌రావు పేరును ప్యానల్‌లో ప్రతిపాదించారు. ఆయన గతంలో అన్నమయ్య జిల్లా ఎస్పీగా పని చేశారు. చంద్రబాబు అంగళ్లులో పర్యటించిన సందర్భంలో వైఎస్సార్సీపీ నాయకులు ఆయనపై దాడులు చేసి, రాళ్లు విసిరితే వాళ్లను వదిలేసి బాధితుడైన చంద్రబాబుపైనే ఏకంగా హత్యయత్నం కేసు పెట్టడంలో గంగాధర్‌రావు పాత్ర కీలకం. వైఎస్సార్సీపీకు అనుకూలంగా ఉంటారనే ముద్ర ఉన్న టి.పనసారెడ్డిని కూడా ఈ జిల్లా ఎస్పీ పోస్టు కోసం ప్రతిపాదించారు.
చిత్తూరు జిల్లా ఎస్పీ పోస్టు కోసం రాజమహేంద్రవరం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఆర్‌వీఈవో కె.ఎస్.ఎస్.వి.సుబ్బారెడ్డి పేరు ప్రతిపాదించారు. ఆయనకూ వైఎస్సార్సీపీ అనుకూలమనే ముద్ర ఉంది. నెల్లూరులో వైఎస్సార్సీపీ ఇప్పటికే ఎదురీదుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి ఏకపక్షంగా పని చేసే వ్యక్తిని ఎస్పీగా నియమించడమేంటని విమర్శలు వినిపిస్తున్నాయి.
నెల్లూరు జిల్లా ఎస్పీ కోసం పంపిన ప్యానల్‌లో ఆరిఫ్ హఫీజ్‌తోపాటు కన్ఫర్డ్ ఐపీఎస్‌లుగా కొన్నాళ్ల కిందటే పదోన్నతులు పొందిన వి.రత్న, ఏబీటీఎస్ ఉదయరాణి పేర్లను ప్రతిపాదించారు. వీరిద్దరికీ గతంలో ఎస్పీగా పని చేసిన అనుభవం లేదు. ఆరిఫ్ హఫీజ్ ఎంపికకు వీలుగా వీళ్లిద్దరు పేర్లూ ప్రతిపాదించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
కొత్తగా నియమితులైన అధికారులు గత అయిదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రయోజనాల కోసమే పని చేశారు. అలాంటి అధికారుల్ని ఏరికోరి సీఎస్ ప్రతిపాదించారు. అలాంటప్పుడు ఇదివరకున్న అధికారుల్ని బదిలీ చేసి ప్రయోజనమేంటి? వైఎస్సార్సీపీ నాయకులు చెప్పిందే చట్టం చేసిందే శాసనం అన్నట్టుగా పని చేసిన కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఈసీ ఇప్పటికే వేటు వేసినా తనపై కూడా కత్తి వేలాడుతున్నా జవహర్‌రెడ్డి ఇంకా స్వామిభక్తి వీడలేదనడానికి తాజాగా ఎస్పీల నియామకమే నిదర్శనం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికలు నిష్పాక్షికంగా జరగాలంటే ముందు సీఎస్‌ను బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
రాష్ట్రంలో రాజకీయ హత్యలు, హింసపై ఈసీ సీరియస్- ఇద్దరు ఎస్పీలపై వేటు ! - EC Will Suspend Two SPs