AP Liquor Shops Application Process : రాష్ట్రంలో కొత్తగా మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. కడప జిల్లాలో 2024- 26 ఏడాదికి సంబంధించి 139 మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని కడప జిల్లా ఎక్సైజ్ పర్యవేక్షణ అధికారి రవికుమార్ వెల్లడించారు. ఇప్పటివరకు 139 దుకాణాలకు 110 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తుల తుది గడువు ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని చెప్పారు. ఆసక్తి ఉన్న టెండరుదారులు దరఖాస్తులను వారి ఇంటి వద్దనే కూర్చుని కంప్యూటర్ ద్వారా చేసుకోవచ్చని తెలిపారు.
గతంలో వలే దరఖాస్తులను భర్తీ చేసి గంటల తరబడి బారులు తీరాల్సిన అవసరం లేదని, ఆన్‌లైన్ సెంటర్కు వెళ్లినా కూడా నిర్భయంగా దరఖాస్తు చేసుకోవచ్చునని అన్నారు. రెండు లక్షల రూపాయలు చలానాలు చెల్లించి ఎవరైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు. టెండర్ దారులకు ఏవైనా సందేహాలు, అనుమానాలు ఉంటే సంబంధిత ఎక్సైజ్ స్టేషన్కు వెళ్లి అక్కడ ఉన్న అధికారులను సంప్రదించాలని సూచించారు. పదవ తేదీన కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా ద్వారా దుకాణాలను కేటాయిస్తామని చెప్పారు. సమయం ఉంది కదా అని నిర్లక్ష్యం చేస్తే చివరి రోజు సాంకేతిక సమస్యలు తలెత్తవచ్చునని, ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.
'మేం ప్రభుత్వాన్ని ఆదేశించలేం' - గీత కార్మికుల దుకాణాలపై హైకోర్టు తీర్పు - Liquor shops in ap
చర్చ అంతా మద్యం దుకాణాలపైనే: పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం చర్చ అంతా మద్యం దుకాణాలపైనే జరుగుతోంది. జిల్లాలో ఈ సారి పోటీపడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుందని, బినామీ పేర్లతో వాటిని దక్కించుకోవాలన్న ఆలోచనతో నేతలు ముందుకు వెళ్తున్నారు. మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు పలువురు ముఖ్యనేతలు, వారి బంధువులు, అనుచరులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ దుకాణాలు దక్కించుకునేందుకు యత్నిస్తున్నారు.
100కు పైగా దరఖాస్తులు:పశ్చిమ గోదావరి జిల్లాలో మద్యం దుకాణాల ఏర్పాటుపై తెరవెనుక మంత్రాంగాలు జోరుగా సాగుతున్నాయి. వ్యక్తిగతంగా దరఖాస్తు చేసేవారు కూడా శుక్రవారం ఆబ్కారీ స్టేషన్ల వద్ద క్యూలు కట్టారు. జిల్లాలో ఆరు స్టేషన్ల పరిధిలో శుక్రవారం 100కుపైగా దరఖాస్తులు అధికారులు చెబుతున్నారు.