INTERNATIONAL CALLS FROM GUNTUR: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఓ డేటా సెంటర్‌లోని సర్వర్ సహాయంతో ఇంటర్నేషనల్ కాల్స్ చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు గుర్తించారు. ఇందులో కీలక నిందితుడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌కు చెందిన రాహుల్‌గా గుర్తించి, అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఆ సిమ్‌లు జియో నెట్‌వర్క్‌విగా తేల్చిన అధికారులు: అంతర్జాతీయ కాల్స్ చేస్తూ తమను బెదిరిస్తున్నారంటూ సుమారు 70 మంది బాధితులు టెలికాం అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు ఆ కాల్స్‌పై నిఘా పెట్టి, వాటికి సంబంధించిన సర్వర్ మంగళగిరిలోని ఓ డేటా సెంటర్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఆ సిమ్‌లు జియో నెట్‌వర్క్‌విగా అధికారులు తేల్చారు. వెంటనే పోలీసులను అప్రమత్తం చేయడంతో వారు సోమవారం డేటా సెంటర్ ఉద్యోగులను ప్రశ్నించారు. దీనికి సంబంధించిన సర్వర్ సెటప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జియో నెట్‌వర్క్ ప్రతినిధుల నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు, కేసు నమోదు చేశారు.
నకిలీ డాక్యుమెంట్స్‌తో 100 సిమ్‌లు: ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌కు చెందిన రాహుల్ అనే వ్యక్తి గత సంవత్సరం నవంబరులో తమను ఆన్‌లైన్‌లో సంప్రదించినట్లు జియో నెట్‌వర్క్ ఉద్యోగులు తెలిపారు. తాను మంగళగిరి ఆటోనగర్‌లో సీబీపీ ఆప్టిమైజ్ ప్రైవేట్ యాడ్స్ లిమిటెడ్‌ను నడుపుతున్నానని, తమ ఉద్యోగులు గ్రూప్ కాల్స్ మాట్లాడుకోవటానికి 100 సిమ్ కార్డులు కావాలంటూ తీసుకున్నారని వారు వివరించారు. రాహుల్ నకిలీ పాన్‌కార్డు, జీఎస్టీ లైసెన్సు పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు.
ఇతర దేశాల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నట్లు మార్చి: వీటిపై క్షేత్రస్థాయిలో పూర్తిగా విచారించకుండానే సిమ్ కార్డులు జారీ చేసినట్లు పోలీసు వర్గాల సమాచారం. మంగళగిరిలో పేర్కొన్న అడ్రస్‌లో ఆ సంస్థ లేదని పోలీసులు తేల్చారు. రాహుల్ ముఠా ఆ నంబర్లను టెక్నాలజీ సాయంతో రీ రూటింగ్ చేసి ఇతర దేశాల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నట్లు మార్చారని వారు వెల్లడించారు. టెలికాం శాఖ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తాజా ఆపరేషన్‌లో సర్వర్ సెటప్‌ను స్వాధీనం చేసుకున్నారు.
'10 రోజులపాటు హింసించారు' - రూ.36 లక్షలు పోగొట్టుకున్న విశ్రాంత ఉద్యోగి
పాత రూపాయి చూపిస్తే రూ.12 లక్షలు - ఆశకు పోయి రూ.2 లక్షలు పోగొట్టుకున్న వైనం