Instant Jonna Dosa Making process : చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు అని తెలిసినా వాటిని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పటికీ చాలా మందికి అర్థం కావడం లేదు. దీంతో ఎప్పటిలాగే ఇంట్లో ఇడ్లీ, దోసె, పూరీలు చేస్తూ సరిపెడుతున్నారు. కొంత మంది గృహిణులు వృద్ధులు, చిన్న పిల్లల కోసం సాయంత్రం వేళలో స్నాక్స్ చేసి పెడుతుంటారు. అలాంటి వారు చిరుధాన్యాల పిండితో రకరకాల వంటలు తయారు చేసుకోవచ్చు. అందుకే ఇవాళ జొన్న పిండి దోసెలు (అట్లు) ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం.
ఆహా! అనిపించే "సొరకాయ గారెలు" - ఇలా చేస్తే ఒకటికి రెండు ఇష్టంగా తింటారు!
మన పూర్వీకులు జొన్నన్నం, జొన్న రొట్టెలు, జొన్న గటక తిని ఎంతో బలంగా ఉండేవారు. కాలక్రమంలో వరి సాగు పెరగడంతో బియ్యం వండుకోవడం అలవాటైంది. గతంలో కలి పెట్టి, గంజి వార్చి అన్నం వండేవారు. కానీ, ఈ తరం గంజి వార్చడం మర్చిపోయారు. మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది మధుమేహ వ్యాధి బారిన పడుతున్నారు. జొన్న రొట్టెలు తినాలని డాక్టర్లు చెప్తున్నా అవి ఎలా చేసుకోవాలో చాలా మందికి తెలియడం లేదు. ఈ నేపథ్యంలో జొన్నలు పిండి పట్టించి దోసె (అట్లు) వేయడం ఎలాగో చూద్దామా!
జొన్న దోసెల కోసం కావల్సిన పదార్థాలు
- జొన్న పిండి - 1 కప్పు
- బియ్యం పిండి - 2 స్పూన్లు
- నీళ్లు - 2 కప్పులు
- ఉల్లిగడ్డ - 1
- క్యారెట్ - 1
- కరివేపాకు - 2 రెమ్మలు
- కొత్తిమీర - చిన్న కట్ట
- అల్లం - చిన్న ముక్క
- పచ్చి మిర్చి - 2
- ఉప్పు - తగినంత
- నూనె - కొద్దిగా
- జిలకర - 1 స్పూన్
- జొన్న అట్ల తయారీకి ముందుగా అరగంట సేపు పిండిలో నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి.
- బియ్యం పిండి కలుపుకోవడం తప్పనిసరి కాదు
జొన్న అట్ల తయారీ ఇలా :
- ముందుగా కప్పు జొన్న పిండి, కొద్దిగా బియ్యం పిండి మిక్స్ చేసుకుని గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసుకుని అరగంట పాటు నానబెట్టుకోవాలి.
- ఈ లోగా ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, క్యారట్, పచ్చిమిర్చి, అల్లం సన్నగా తరుముకోవాలి.
- తురుమును జొన్నపిండి మిశ్రమంలోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
- తర్వాత సరిపడా ఉప్పు, టేబుల్ స్పూన్ జీలకర లేదా పొడి కలుపుకున్నా సరిపోతుంది.
- ఇప్పుడు జొన్న పిండి అట్ల మిశ్రమం తయారయినట్లే.
- ముందుగా పొయ్యిపై పెనం పెట్టుకుని బాగా వేడి చేసుకోవాలి. పెనం వేడి కాగానే కొద్దిగా నూనె రాసుకుని పిండి మిశ్రమాన్ని అట్లుగా పోసుకోవాలి.
- అట్లు సరిగా వస్తున్నాయో లేదో తెలుసుకోవాలంటే మొదట చిన్నగా వేసుకుని చూసుకోవాలి. ఆ తర్వాత పెద్దగా వేసుకోవాలి.
- పిండి అరగంట పాటు నానుతుంది కాబట్టి దోసెలు విరిగిపోయే అవకాశాలు చాలా తక్కువే.
- దోసెలను ఒక వైపు కాల్చుకున్నా సరిపోతుంది.
- కరకరలాడేలా కావాలంటే దోసె రెండు వైపులా గోల్డెన్ రంగు వచ్చే వరకు కాల్చుకుంటే క్రిస్పీగా బాగుంటుంది.
- ఈ దోసెలు పల్లీ చట్నీ, టమాట చట్నీ, పుదీనా చట్నీలోకి చాలా బావుంటాయి.
ఆహా! అనిపించే "బెండకాయ పచ్చడి" - వేడివేడి అన్నంలోకి అద్భుతమే!
"గుత్తి వంకాయ మసాలా కర్రీ" - కుక్కర్లోనే అద్దిరిపోయేలా ఇలా ఈజీగా చేసేయండి!