Minister Narayana Meeting With Mumbai Metropolitan Region Development Authority : ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ, సిడ్కో అధికారులతో మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు సమావేశమయ్యారు. ఎంఎంఆర్డీఏ ప్లానింగ్ డైరెక్టర్ శంకర్ దేశ్ పాండే, ఇతర విభాగాల అధికారులు ఇందులో పాల్గొన్నారు. ముంబయి అభివృద్ధిలో ఎంఎంఆర్డీఏ (MMRDA) కీలక పాత్ర వహిస్తోంది. ముంబయిలో రోడ్లు, మెట్రో రైలు, హౌసింగ్ ప్రాజెక్టులను ఇది చేపడుతోంది.
మహానగరంలో రోడ్ల అభివృద్ధి, మెట్రో రైలు ప్లానింగ్, రవాణా ప్రణాళికలు, ఇళ్ల నిర్మాణం, రీజినల్ డెవలప్మెంట్, నిధుల సమీకరణపై ముంబై అధికారులు మంత్రి నారాయణకు వివరించారు. మహానగరంలో విదేశీ పెట్టుబడుల సహకారంతో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్న తీరును మంత్రికి తెలిపారు. ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం నిధుల సమీకరణ చేస్తున్న తీరును మంత్రి తెలుసుకున్నారు. ముంబయి అభివృద్ధికి ఎంఎంఆర్డీఏ (Mumbai Metropolitan Region Development Authority) తీసుకుంటున్న విధానాలను ఏపీలోని నగరాల అభివృద్ధికి అనుసరించే ఆలోచనలో మంత్రి నారాయణ ఉన్నారు.
విశాఖ మెట్రోపై ప్రభుత్వం ఫోకస్ - భూసేకరణకు వేగంగా అడుగులు
గతేడాది జులైలో కూడా మంత్రి నారాయణ నేతృత్వంలో అధికారుల బృందం నవీ ముంబైలో పర్యటించింది. సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, అదనపు కమిషనర్లు సూర్యసాయి ప్రవీణ్‌చంద్, నవీన్‌తో కలిసి మంత్రి నారాయణ పర్యటించారు. మహారాష్ట్ర ప్రభుత్వ సంస్థ సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో భేటీ అయ్యారు. నవీ ముంబై నగర ప్రణాళికలు, అభివృద్ధిలో కీలకపాత్ర వహిస్తున్న సిడ్కో హౌసింగ్ స్కీమ్స్ గురించి చర్చించారు. ఈ సందర్భంగా అభివృద్ధి ప్రణాళికలను నారాయణ టీం కు సిడ్కో అధికారులు వివరించారు. ఈ క్రమంలో రెండోసారి మంత్రి నారాయణ నేతృత్వంలో మరోసారి ముంబాయిలో పర్యటించడంపై అధికార వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఇది ఇలా ఉంటే, ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి వికేంద్రీకరణకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే అభివృద్ధి వికేంద్రీకరణకు అడుగులు వేస్తుంది. అటు విశాఖ నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు మెట్రో రైలు ప్రాజెక్టును పట్టాలెక్కించనుంది. అతి త్వరలో మెట్రో పనులు ప్రారంభిస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ గతంలోనే స్పష్టం చేశారు.