Narisetti Akshay Selected for AI Resident Program : మనం ఔనన్నా కాదన్నా భవిష్యత్‌లో మానవాళిపై అత్యంత ప్రభావం చూపనుంది కృత్రిమ మేధస్సు. ఈ సాంకేతికతను అందిపుచ్చుకొని అందరికన్నా ముందుండాలని తొందరపడుతున్నాయి చాలా దేశాలూ, అదే విధంగా సాంకేతిక సంస్థలు. ఈ పోటీతోనే హార్వర్డ్ విశ్వవిద్యాలయం, ఎంఐటీలు ‘వేరబుల్ టెక్నాలజీ రెసిడెంట్ ప్రోగ్రామ్’కి తెర తీశాయి.
సాంకేతికను అభివృద్ధి చేయడమే ఈ ప్రోగ్రాం ఉద్దేశం : దైనందిన జీవితంలో మనుషులు ధరించే గ్యాడ్జెట్లలో కృత్రిమ మేధస్సును జొప్పించి, వాళ్ల ఆలోచనలు, భావోద్వేగాలను సైతం నియంత్రించగలిగేలా సాంకేతికను అభివృద్ధి చేయడమే ఈ ప్రోగ్రాం ఉద్దేశం. ఇది అమెరికాలోని ఎంఐటీ మీడియా ల్యాబ్, హార్వర్డ్ ఇన్నోవేషన్ ల్యాబ్‌లో 3 నెలలు కొనసాగనుంది. ఎంపికైనవారు తమ తెలివికి పదును పెట్టేలా ఇక్కడ పరిశోధనలు చేయాలి. వీళ్లు తయారు చేసిన వేరబుల్ బయో ట్రాకర్, న్యూరల్ ఇంపల్సెస్ చిప్స్, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ని వేరబుల్ గ్యాడ్జెట్స్‌లో అమర్చుతారు.
ఇవి కాళ్లూ, చేతులు, చూపు, మాట లేని వాళ్లు ధరించినా మెదడులోని ఆలోచనల్ని చదివి ఆ సమాచారాన్ని అందిస్తాయి. ఈ పరిశోధనల్లో సలహాలు ఇచ్చేందుకు, సందేహాలను తీర్చేందుకు రెండు విద్యాసంస్థల్లోని సీనియర్ పరిశోధకులు, అధ్యాపకులు సిద్ధంగా ఉంటారు. గతంలో ఇక్కడ ప్రోగ్రామ్ పూర్తి చేసిన వాళ్లకు పరిశోధకులుగా చాలా అవకాశాలు దక్కాయి. మెటా, గూగుల్ డీప్‌మైండ్‌లాంటి పెద్ద కంపెనీల్లో భారీ వేతనంతో ముఖ్యమైన స్థాయిల్లో చేరారు. చేసిన ఇన్వెన్షన్స్ ఆధారంగా వందల కోట్ల రూపాయల పెట్టుబడులు దక్కించుకొని అంకుర సంస్థల్ని సైతం ప్రారంభించిన వారు కూడా ఉన్నారు.
మొదట్లో సాదాసీదా విద్యార్థిగా:25 సంవత్సరాలకో ప్రపంచ యవనికపై ప్రతిభ చూపిస్తున్న అక్షయ్ మొదట్లో సాదాసీదా విద్యార్థినే. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలోని రావిపాడు తన సొంతూరు. 9వ తరగతిలో ఉన్నప్పుడు వాళ్ల స్కూల్‌కి ఒక ఎలక్ట్రానిక్ పరికరం తీసుకొచ్చి ప్రదర్శించారు. తర్వాత దాన్ని ఇంటికి తీసుకెళ్లి, అందులోని కెపాసిటర్లు, ట్రాన్సిస్టర్లు, ఇతర పరికరాలు బయటకు తీసి సొంతంగా ప్రయోగాలు చేశాడు. యూట్యూబ్‌లో వెతికి, ఆ పరికరాలతో కొన్ని ప్రాజెక్టులను సైతం తయారు చేశాడు. అలా సైన్స్, టెక్నాలజీపై అక్షయ్‌కి ఆసక్తి మొదలైంది. తర్వాత చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీలో చేరడం పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది.
దేశం దృష్టిని ఆకర్షించిన అక్షయ్ : అక్కడ టెక్నికల్ క్లబ్స్‌లో అటానమస్ వెహికల్స్ గురించి తెలుసుకున్నాడు. మొదటి సెమిస్టర్‌లోనే సీ కోడింగ్ వంటివి నేర్చుకున్నాడు. అందరి కంటే భిన్నంగా కంప్యూటర్‌లో తెరపై కాకుండా, మైక్రో కంట్రోలర్ల ద్వారా దీనిని రాశాడు. విద్యార్థిగా తను నేర్చుకున్న ప్రతీదీ ఆన్‌లైన్ విద్యాసంస్థ యూడెమీలో బోధించేవాడు. ఈ అమితాసక్తి, టెక్నాలజీపై పట్టుతోనే ఇంజినీరింగ్ పూర్తయ్యేసరికి గూగుల్, భారత్ ఎక్స్, జేపీమోర్గాన్ సహా 7 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ దక్కించుకున్నాడు. భారత్ ఎక్స్ ఇంటర్న్‌షిప్‌లో అయితే ఏకంగా నెలకు లక్షన్నర రూపాయల వేతనం అందుకున్నాడు. ప్రస్తుతం ప్రతిష్ఠాత్మక ప్రోగ్రామ్‌కి ఎంపికై, దేశం దృష్టిని అక్షయ్ ఆకర్షించాడు.