Police Case Filed On Director RGV :సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నాయకుల ప్రతిష్ఠకు భంగం కలిగేలా, మార్ఫింగ్ ఫొటోలతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేయడం, సభ్య సమాజం సిగ్గుపడేలా అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ విషయంలో ఏపీ పోలీసు శాఖ క్షేత్రస్థాయిలో దూకుడు పెంచింది. ఇప్పటికే కొందరిపై కేసులు నమోదు చేసి అరెస్టులు సైతం చేస్తున్నారు. మరికొందరిపై చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధులు ఇంటూరి రవి కిరణ్, బోరుగడ్డ అనిల్ కుమార్ ఇలా పలువురని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్, టీడీపీ నేత నారా లోకేశ్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణిల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టు చేశారని డైరెక్టర్ రామ్గోపాల్ వర్మపై తాజాగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Ram Gopal Varma Tweet on Nara Chandrababu Naidu : సినీ డైరెక్టర్ రామ్గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు పోలీసు స్టేషన్లో ఐటీ చట్టం కింద కేసు నమోదు అయ్యింది. వ్యూహం మూవీ ప్రమోషన్ల సమయంలో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టు చేశారని ఆయనపై కంప్లైంట్ చేశారు. తెలుగుదేశం పార్టీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఆర్జీవీపై సమీప స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.