Registration Charges Hike in AP : పట్టణప్రాంతాల్లో ప్రతి ఏడాది ఆగస్టు 1, గ్రామీణ ప్రాంతాల్లో రెండు సంవత్సరాలకు రిజిస్ట్రేషన్ విలువలు, స్ట్రక్చర్ విలువలను సవరించాలి. కానీ వైఎస్సార్సీపీ సర్కార్ ప్రత్యేక రివిజన్ పేరుతో విలువలను పెంచి ప్రజలపై ఆర్థికభారాన్ని మోపింది. వీటిపై ప్రస్తుతం పునఃసమీక్ష జరుగుతోంది.
రాష్ట్రంలో ఆస్తుల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్ విలువలను డిసెంబర్ 1 నుంచి పెంచాలని ఏపీ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదంతో అధికారిక ప్రకటన రానుంది. వైఎస్సార్సీపీ అసమర్థ పాలన వల్ల కొన్నిచోట్ల రిజిస్ట్రేషన్ విలువలు బహిరంగ మార్కెట్ కంటే ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల స్థిరాస్తి రంగంలో స్తబ్ధత నెలకొంది. ఈ లోపాలు సరిదిద్ది స్థానిక అభివృద్ధి, ఇతర అంశాల ప్రతిపాదికన కొత్త విలువలను సర్కార్ ఖరారు చేస్తుంది.
ఈ మేరకు జిల్లా సంయుక్త కలెక్టర్ స్థాయిలో కమిటీలు ఏర్పాటుచేసింది. రిజిస్ట్రేషన్ విలువల తీరుపై రెండున్నర నెలల నుంచి రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ కసరత్తు చేస్తోంది. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, రెవెన్యూమంత్రి అనగాని సత్యప్రసాద్ సచివాలయంలో శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమై విలువల సవరణ కసరత్తు పురోగతిని సమీక్షించారు. విలువల పెంపు, తగ్గింపు ఏయే ప్రాంతాల్లో ఎలా చేయాలన్నదానిపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
ఇష్టానుసారం కాకుండా :కనిష్ఠంగా 10 శాతం నుంచి గరిష్ఠంగా 20 శాతం వరకు రిజిస్ట్రేషన్ విలువలు పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రిజిస్ట్రేషన్ విలువలు వాస్తవికతకు దూరంగా ఉంటే తగ్గిస్తారు. కారిడార్ గ్రోత్, జాతీయ రహదారులు, ఇతర అంశాల ప్రతిపాదికన విలువలు ఖరారుచేస్తామని రెవెన్యుమంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని సర్వే నంబర్లు, వాటి పరిధి, జరిగిన అభివృద్ధి, దస్తావేజుల రిజిస్ట్రేషన్, ఇతర వివరాలను ప్రత్యేక కమిటీలు పరిశీలిస్తున్నాయని చెప్పారు. గత సర్కార్లో మాదిరిగా కాకుండా విలువల పెంపు క్షేత్రస్థాయి పరిస్థితులకు తగ్గట్లు ఉంటుందన్నారు. 2023-24లో దస్తావేజుల రిజిస్ట్రేషన్ ద్వారా రూ.10,005 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ 24 వరకు రూ.5,235.31 కోట్ల ఆదాయం వచ్చిందని అనగాని సత్యప్రసాద్ వివరించారు.