AP Minister On TG Tirumala Recommendation Letters : తిరుమలలో తెలంగాణ నుంచి వచ్చే సిఫార్సు లేఖల స్వీకరణపై స్పష్టత వచ్చింది. టీటీడీకి కొత్త బోర్డును నియమించిన తరువాతే తెలంగాణ నుంచి వచ్చే అన్ని సిఫార్సు లేఖలను స్వీకరిస్తామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఆయన ఇవాళ యాదాద్రిలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయనకు ఈవో భాస్కర్ రావు, ఆలయ సంప్రదాయ ప్రకారం స్వాగతం పలికారు. గర్భగుడిలో ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం లడ్డు ప్రసాదం, స్వామి వారి చిత్ర పటాన్ని ఆలయ ఈఓ భాస్కర్ రావు అందజేశారు.
తిరుమల తరువాత చాలా మంది భక్తులు దర్శించుకునే యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని మంత్రి హోదాలో దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని వాసంశెట్టి సుభాష్ అన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ సిఫార్సు లేఖల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా టీటీడీకి నూతన బోర్డు నియామకం తరువాత వాటిని స్వీకరించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
"టీటీడీకి ప్రస్తుతం బోర్డు లేదు. త్వరలో నూతన బోర్డు ఏర్పాటవుతుంది. ఆ తరువాత తెలంగాణ నుంచి వచ్చే సిఫార్సు లేఖలను స్వీకరిస్తాం" - వాసంశెట్టి సుభాష్, ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి