AP Liquor Shops Lottery Process: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మద్యం దుకాణాల కేటాయింపు లాటరీ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలవారీగా కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో లైసెన్సులు జారీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పారదర్శకంగా మొత్తం లాటరీ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. కలెక్టర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో లాటరీ నిర్వహిస్తున్నామన్నారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే నేరుగా జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదు చేయవచ్చని అన్నారు.
లాటరీ సమయంలో దరఖాస్తుదారు హాజరు తప్పనిసరి కాదని తెలిపారు. దరఖాస్తుదారు లేనప్పటికీ వారికి లాటరీ తగిలితే సమాచారం అందజేస్తారన్నారు. దుకాణాల వారీగా వచ్చిన దరఖాస్తులను లాటరీ తీసి, వారికి దుకాణాలను అప్పగిస్తున్నారు. లాటరీలో గెలుపొందిన లైసెన్స్ దారుడికి దుకాణం నిర్వహించుకునేందుకు రెండేళ్ల కాలపరిమితి ఉంది. మద్యం దుకాణాలను మంగళవారం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించనున్నారు. బుధవారం నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది.
శ్రీకాకుళం జిల్లాలో 158 మద్యం దుకాణాలకు గాను 4 వేల 6 వందల 71 దరఖాస్తులు చేసుకున్నారు. అంబేడ్కర్ కళావేదికలో జరుగుతున్న లాటరీ ప్రక్రియ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అబ్కారీశాఖ ఉప కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి పర్యవేక్షణలో కొనసాగుతుంది. దీనిలో భాగంగా శ్రీకాకుళం, ఆమదాలవలస, రణస్థలం, పొందూరు, నరసన్నపేట, కొత్తూరు, పాతపట్నం, టెక్కలి, కోటబోమ్మాళి, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం సర్కిళ్లకు లాటరీ తీస్తున్నారని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. విజయనగరం జిల్లాలో మొత్తం 153 షాపులకు గాను 5,242 ధరఖాస్తులు అందాయి. వీటిని లాటరీ తీసేందుకు కలెక్టరేట్ ఆడిటోరియంలో మొత్తం 10 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియను డిజిటల్ స్క్రీన్‌పై ప్రదర్శించారు. కెమెరాల్లో రికార్డు చేశారు.
విశాఖ జిల్లాలో 155 దుకాణాలకు గాను 4,139 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తుల్లో ముగ్గురిని లాటరీ ద్వారా ఎంపిక చేస్తున్నారు. తదుపరి క్షుణ్ణంగా పరిశీలించి లాటరీలో మొదటి వచ్చిన వారిని దుకాణానికి ఎంపిక చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా 135 మద్యం దుకాణాలు గాను 3214 దరఖాస్తులు వచ్చాయి. ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో లాటరీ ప్రక్రియ జరుగుతోంది. దరఖాస్తుదారులలో మహిళలు అధికంగా ఉన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి దరఖాస్తు చేసుకున్న అధిక సంఖ్యలో రావడంతో సందడి వాతావరణం నెలకొంది.
మద్యం దుకాణాలకు వేళాయె - లెక్క తేలింది కిక్కు ఎవరికో!
దుకాణాలు దక్కించుకున్న ఇతర రాష్ట్రాల వ్యాపారులు:ఎన్టీఆర్ జిల్లావిజయవాడ నగరంలో మొత్తం 133 దుకాణాలకు సంబంధించి 5 వేల 825 దరఖాస్తులు వచ్చాయి. సీరియల్ నెంబర్ ప్రకారం అధికారులు లాటరీ తీస్తున్నారు. గురునానక్ కాలనీలోని NAC కల్యాణ మండపంలో జరుగుతున్న లాటరీకి మహిళా దరఖాస్తుదారులు కూడా హాజరయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 123 షాపులకు లాటరీ ద్వారా ఎంపిక చేస్తున్నారు. 3 మద్యం దుకాణాలకు 2942 దరఖాస్తులు దాఖలయ్యాయి. కృష్ణా జిల్లాలో మద్యం దుకాణాలు ఇతర రాష్ట్రాల వ్యాపారులు సైతం దక్కించుకున్నారు. మచిలీపట్నంలో 1వ నెంబర్ దుకాణాన్ని కర్ణాటక వాసి మహేష్ ఎ బాతే, 2వ నెంబర్ షాపును యూపీ వాసి లోకేష్ చంద్ దక్కించుకున్నారు.