AP High Court Orders on Illegal Mining : కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం నడికుదురు, నిమ్మగడ్డ గ్రామాల పరిధిలోని కృష్ణా నదిలో ఇసుక, బుసక అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశించింది. తవ్వకాలను నిలువరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ స్థాయి నివేదిక ఇవ్వాలని తేల్చి చెప్పింది. ప్రతివాదులను నోటీసులు జారీ చేస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాగుర్, జస్టిస్ ఆర్.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.
Illegal Mining at Krishna River :కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా నడికుదురు, నిమ్మగడ్డ గ్రామాల పరిధిలోని కృష్ణా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలను నిలువరించడంలో అధికారులు విఫలమయ్యారని పేర్కొంటూ సామాజిక కార్యకర్త తాతానేని లీలాకృష్ణా హైకోర్టులో పిల్ వేశారు. న్యాయవాది తులసిదుర్గాంబ వాదనలు వినిపిస్తూ కళ్ల ముందు ఇసుక తవ్వకాలు జరుగుతున్నా తహసీల్దార్, పోలీసులు మౌనంగా ఉంటున్నారని అన్నారు. తవ్వకాల ఫొటోలను కోర్టు దృష్టికి తెచ్చారు.
ఇసుకను ఊడ్చేస్తున్న వైసీపీ నేతలు- ఎన్జీటీ విచారణలో అధికారులకే చిక్కులు!
విచారణ రెండు వారాలకు వాయిదా :గనుల శాఖ ప్రభుత్వ న్యాయవాది నవీన్ వాదనలు వినిపించారు. అక్కడ తవ్వుతోంది ఇసుక కాదని బుసక అన్నారు. నదిలో తవ్వకాల వ్యవహారం జలవనరుల శాఖ పరిధిలోనిది అన్నారు. చర్యలు తీసుకునే అధికారులకు పిటిషనర్ వినతి ఇవ్వకుండా సంబంధం లేని వారికి అందజేశారని అన్నారు. అనుమతులున్నాయా? లేవా? అనే విషయాన్ని కనుక్కొని వివరాలు సమర్పిస్తానని అన్నారు. ఫొటోలను పరిశీలించిన ధర్మాసనం తవ్వకాలు జరుగుతున్నట్లు అభిప్రాయపడింది. తక్షణం నిలుపుదలకు చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ప్రతివాదులను నోటీసులు జారీ చేస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.