HC on Kodi Pandalu in AP :రాష్ట్రంలో సంక్రాంతి సంబరాల పేరిట కోడి పందేలు, జంతు హింస జరగకుండా చూడాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్‌ఎన్.చక్రవర్తి మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కోడిపందేలు, జూదం, అక్రమ మద్యం విక్రయాలను నిలువరించాలంటూ జి.వెంకటరత్నం మరో ఇద్దరు, చేగొండి శ్రీనివాస్ హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు.
Sankranti Kodi Pandalu in AP :ఈ వ్యాజ్యాలపై మంగళవారం నాడు హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు కేవీఎల్.నరసింహారావు, దాసరి ప్రసాద్ వాదనలు వినిపించారు. సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు అడ్డుకోవాలని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు కావడం లేదని వారు ధర్మాసనానికి వివరించారు. వాటిని అడ్డుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను న్యాయమూర్తి ముందు ఉంచారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్‌ఎన్.చక్రవర్తి గతంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. అనంతరం వ్యాజ్యాలపై విచారణను ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేశారు.