KTR Attend to ACB Enquirty: ఫార్ములా-ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు దాదాపు 7 గంటలపాటు ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ పాత్రపై దర్యాప్తు అధికారి డీఎస్పీ మజీద్ ఖాన్ ప్రశ్నించగా జాయింట్ డైరెక్టర్ రితిరాజ్ పర్యవేక్షించారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఏసీబీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. తనకున్న అవగాహన మేరకు సమాధానాలు ఇచ్చానని స్పష్టం చేశారు. ఏసీబీ అధికారులకు అన్ని విధాలా సహకరించానని, విచారణకు ఎన్నిసార్లు పిలిచినా హాజరవుతానని కేటీఆర్ అన్నారు. ఇది ఒక చెత్త కేసు అని విచారణ అధికారులకు కూడా చెప్పానని వెల్లడించారు. అసంబద్ధమైన కేసులో ఎందుకు విచారిస్తున్నారని అడిగానన్నారు. ఏసీబీ అధికారులు కొత్త ప్రశ్నలు ఏమీ అడగలేదని, నాలుగైదు ప్రశ్నలనే నలబై రకాలుగా అడిగారన్నారు.
ఇది రాజకీయ కక్షపూరిత కేసు అని చెప్పినట్లు కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ ఒత్తిడితో ఏం చేస్తున్నారో మీకే తెలియట్లేదని అధికారులకు చెప్పానన్నారు. రాజకీయ కేసు పెట్టి రేవంత్‌రెడ్డి సాధించేదేమీ ఉండదని చెప్పానన్నారు. ఏసీబీ అధికారులు మళ్లీ ఎప్పుడు విచారణకు పిలుస్తారో తెలియదని, ఏసీబీ అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని కేటీఆర్ స్పష్టం చేశారు.