AP HC on Lesbian Partner Petition : తన లెస్బియన్ భాగస్వామిని ఆమె తండ్రి అక్రమంగా నిర్బంధించారంటూ విజయవాడకు చెందిన ఓ యువతి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై మంగళ నాడు హైకోర్టు విచారణ చేపట్టింది. అక్రమ నిర్బంధానికి గురైందని ఆరోపణ ఎదుర్కొంటున్న మరో అమ్మాయితో న్యాయమూర్తులు ఛాంబర్లో మాట్లాడారు. ఆమె మేజర్ అయినందున ఇష్టప్రకారం ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది. నిర్ణయాలు తీసుకునే హక్కు సదరు యువతికి ఉంటుందని తెలిపింది. చట్ట నిబంధనలు ఇదే విషయాన్ని చెబుతున్నాయని గుర్తుచేసింది. ఈ విషయంలో అమ్మాయి తండ్రి జోక్యం చేసుకోకుండా నిలువరించాలని పోలీసులకు ధర్మాసనం స్పష్టంచేసింది.
ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావుతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. లెస్బియన్ భాగస్వాములైన తాము ఏడాదికిపైగా సహజీవనం చేస్తున్నామని, కృష్ణలంకలో ఉంటున్న తన స్వేహితురాలి తండ్రి ఆమెను అక్రమంగా నిర్బంధించారంటూ ఓ యువతి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ వాదనలు వినిపించారు. లెస్బియన్ సంబంధం చట్టబద్ధమేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని వివరించారు. మేజర్ అయిన యువతిని ఆమె తండ్రి నిర్బంధించండం చట్ట విరుద్ధమని న్యాయస్థానానికి తెలిపారు.