AP Govt Starts Revenue Meetings in Villages:దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మీ భూమి-మీ హక్కు పేరుతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఈ సదస్సుల్లో పాల్గొనేందుకు రెవెన్యూ యంత్రాంగం గ్రామాల్లో అడుగుపెట్టబోతుంది. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చుట్టూ తిరగడం కాకుండా ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు పరిష్కరించాలన్న ఉద్దేశంతో సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయి. వీటిని శుక్రవారం నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు 33 రోజులపాటు సుమారు 17,564 గ్రామాల్లో నిర్వహించేలా అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సదస్సుల నిర్వహణ పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు ఒక్కొక్క ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ బాపట్ల జిల్లా రేపల్లెలో సదస్సు ప్రారంభిస్తారు. మిగిలిన జిల్లాల్లోనూ ఎంపిక చేసిన గ్రామంలో రెవెన్యూ సదస్సులను మంత్రులు హాజరుకానున్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ఓ పక్క కొనసాగిస్తూనే ప్రజల ఆస్తుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. గత వైఎస్సార్సీపీ పాలనలో ప్రజల భూములకు రక్షణ లేకుండా చేసిన టైటిల్ యాక్ట్‌ను అధికారంలోనికి రాగానే కూటమి ప్రభుత్వం రద్దు చేసింది.
సాగునీటి సంఘాల ఎన్నికలకు వేళాయె - మూడంచెలుగా నిర్వహణ
రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం:దీనికి కొనసాగింపుగా వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన 'సహజ వనరుల దోపిడీ'పై శ్వేతపత్రాన్ని సీఎం చంద్రబాబు విడుదల చేశారు. దీనికి అనుగుణంగా రెవెన్యూ శాఖ చేపట్టిన చర్యలు వివిధ దశల్లో ఉన్నాయి. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో భూ కబ్జాలు, రికార్డుల్లో మార్పులు, రీ-సర్వే పేరుతో ప్రజలకు అనేక కష్టాలు తెచ్చిపెట్టింది. ప్రభుత్వంతోపాటు ప్రైవేట్ ఆస్తులకు కూడా రక్షణ లేకుండాపోయింది. ఈ పరిస్థితుల్లోనే రెవెన్యూ శాఖకు చెందిన సమస్యల శాశ్వత పరిష్కారంపై దృష్టిపెట్టినట్లు రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రతి దశలో పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా అధికారులను నియమించినట్లు తెలిపారు.