AP Full Budget 2024 : ఆంధ్రప్రదేశ్‌లో 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ తయారీకి కసరత్తు ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆర్థిక ఏడాది ప్రారంభానికి ముందే గత వైఎస్సార్సీపీ సర్కార్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించింది. తొలి 4 నెలల కాలానికి ఆ పద్దు ఆమోదించగా ఆ తర్వాత వచ్చిన కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నా పెట్టలేదు.
AP Govt Exercise on Budget 2024 :గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక లోటుపాట్లు మొత్తం క్రోడీకరించేందుకే ఎక్కువ సమయం తీసుకోవడంతో మరోసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తీసుకున్నారు. ఆగస్టు నుంచి మరో 4 నెలలపాటు ఇది అమల్లో ఉండనుంది. అయితే నవంబర్ నెలాఖరులోపు మాత్రం పూర్తిస్థాయి పద్దు ప్రవేశపెట్టాల్సి ఉండటంతో ఆర్థికశాఖ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది.
పూర్తిస్థాయి బడ్జెట్‌పై కసరత్తు : బడ్జెట్ తయారీ కోసం ప్రభుత్వశాఖల నుంచి ఇప్పటికే ప్రాథమికస్థాయిలో ప్రతిపాదనలు తీసుకుంటున్నారు. పూర్తిస్థాయి పద్దు తయారీకి విధివిధానాలు, ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అవసరమైన సమాచారంపై చర్చించేందుకు ఆర్థికశాఖలో అదనపు కార్యదర్శి స్థాయి అధికారి ప్రస్తుతం వివిధ శాఖల అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. సోమ, మంగళవారాల్లో దాదాపు 19 ప్రభుత్వ శాఖలతో చర్చించారు.