IVRS Survey in AP :ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, పౌరసేవలపై ప్రజల నుంచి నిరంతర ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఇందులో భాగంగా మెరుగైన సేవల కోసం నేరుగా లబ్ధిదారుల నుంచి అభిప్రాయ సేకరణ జరపాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు ఐవీఆర్ఎస్ విధానాన్ని విస్తృతంగా ఉపయోగించాలని చెప్పారు. ఏ అంశంపైనైనా ప్రజలు చెప్పిందే ఫైనల్ అని స్పష్టం చేశారు. నాణ్యమైన సేవల కోసం ఖచ్చితమైన అభిప్రాయం చెప్పాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, చేపట్టే కార్యక్రమాలు, తీసుకునే నిర్ణయాలపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం ముందుకు వెళ్లాలని సర్కార్ నిర్ణయించింది. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు వారి అభిప్రాయాల మేరకు నడుచుకోనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకనుగుణంగా ఇకపై ప్రభుత్వం అమలు చేసే పథకాలపై ఐవీఆర్ఎస్ ఫోన్లు చేయడం ద్వారా ఆయా కార్యక్రమాల అమలు తీరును తెలుసుకోనున్నారు.
లబ్ధిదారుల నుంచి అభిప్రాయాల సేకరణ : ఈ క్రమంలో లబ్ధిదారులకే నేరుగా కంప్యూటర్ బేస్డ్ ఫోన్ కాల్స్ ద్వారా ఆ పథకం వల్ల ప్రయోజనం, దాని అమలు, సేవల్లో నాణ్యత వంటి అంశాలపై ఫీడ్ బ్యాక్ను ప్రభుత్వం సేకరించనుంది. వాటిపై ప్రజలు ఇచ్చే రేటింగ్ ఆధారంగా సర్కార్ మార్పులు చేర్పులు చేసుకొని పనిచేయనుంది. ఇంటింటికీ పింఛన్లు, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి పథకాలకు సంబంధించి ఈ ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. పింఛను సక్రమంగా ఇంటి వద్దనే అందుతుందా? లేదా? దీపం పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? వంటి ప్రశ్నల ద్వారా లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు.
పథకాలతో పాటు ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీల అమలుపైనా ప్రజాభిప్రాయాన్ని ఐవీఆర్ఎస్ ద్వారా సర్కార్ తెలుసుకోనుంది. ఉచిత ఇసుక విధానం అమలు, నూతన మద్యం పాలసీ, అమ్మకాలపైనా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. పథకాలు, కార్యక్రమాలతో పాటు రానున్న రోజుల్లో రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ వంటి పలు కీలక శాఖల్లో ప్రజలు పొందుతున్న పౌరసేవలపై కూడా ఐవీఆర్ఎస్ ద్వారా సమాచారం సేకరించనున్నారు. ఈ సమాచారంలో ప్రజలు ఎక్కడైనా అసంతృప్తి వ్యక్తం చేస్తే వాటికి గల కారణాలు విశ్లేషించి సేవలను మరింత మెరుగుపరుస్తారు.