AP Government Cheating Unemployed Youth: జాతీయ నూతన విద్యావిధానంలో భాగంగా విద్యార్ధి, ఉపాధ్యాయ నిష్పత్తిని అనుసరించి దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ ఖాళీలపై కేంద్రం పార్లమెంటులో ప్రకటన జారీ చేసింది. 2023-24 సంవత్సరానికిగానూ ఉన్న ఖాళీలను కేంద్రం పార్లమెంటులో ప్రకటించింది.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ లో ప్రాథమిక పాఠశాలల్లో 32 వేల 425 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉంటే, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6 వేల 347 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. కానీ వేల సంఖ్యలో ఉపాధ్యాయుల ఖాళీలు ఉన్నా వాటిని ప్రకటించకుండా జగన్ ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోంది. ఎన్నికల ముందు మెగా డీఎస్సీ ఇస్తామంటూ హామీ ఇచ్చిన జగన్, ఇప్పుడు కేవలం 6 వేల పోస్టులే ప్రకటించడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.
నూతన విద్యావిధానంలో భాగంగా విద్యార్ధి ఉపాధ్యాయ నిష్పత్తి ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో 25:1 గా ఉంటే, కొన్ని రాష్ట్రాల్లో ఇది 30:1 గా ఉన్నట్టు కేంద్రం పేర్కొంది. జాతీయ విద్యా విధానం నిర్దేశించిన నిష్పత్తికి అనుగుణంగా ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో ఉపాధ్యాయుల నియామకం ఆయా రాష్ట్రాలు చేపట్టాల్సి ఉందని కేంద్రం చెబుతోంది. కానీ రాష్ట్రంలో 6 వేల 100 పోస్టులు మాత్రమే ఖాళీ ఉన్నాయంటూ రాష్ట్రప్రభుత్వం ప్రకటించటం ఆ మేరకు డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయటాన్ని నిరుద్యోగులు తప్పుబడుతున్నారు. టీచర్ల నియామకాల విషయంలో రాష్ట్రప్రభుత్వ వైఖరి తమ పాలిట శాపంగా మారిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు.
'నాడు మెగా - నేడు దగా' - ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగుల ఆందోళన