Report on AP Floods Loss 2024 :రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టంపై మధ్యంతర నివేదికను ఏపీ ప్రభుత్వం కేంద్రానికి సమర్పించింది. గత నెల 31 నుంచి కురిసిన అత్యంత భారీ వర్షాలు, ముంచెత్తిన వరదల కారణంగా రాష్ట్రంలో 10.64లక్షల మందికి పైగా ప్రభావితులయ్యారని పేర్కొంది. ప్రకాశం బ్యారేజీ డ్యాం నిర్మాణం తర్వాత ఎన్నడూ లేనంతగా ఈ నెల 2న 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని ఇది ఏకంగా 4 గంటల పాటు కొనసాగిందని వివరించింది.
ప్రకాశం బ్యారేజీ కట్టాక - పెద్ద వరద : ఎగువన ఉన్న ఇబ్రహీంపట్నం, కంచికచర్ల ప్రాంతాలతోపాటు దిగువన ఉన్న కృష్ణా, బాపట్ల జిల్లాల్లోని లంక గ్రామాలు నీటమునిగాయని ప్రభుత్వం నివేదికలో తెలిపింది. కృష్ణా నదిలో ప్రవాహాలు, ప్రకాశం బ్యారేజీని పునఃపరిశీలించడంతోపాటు కరకట్టలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ప్రకాశం బ్యారేజీ ఎగువన మరో జలాశయాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని వివరించింది. ఆకస్మికంగా ముంచెత్తుతున్న వరదల కారణంగా విజయవాడలోని పలు ప్రాంతాలు ముంపు బారిన పడుతుండటంతో బుడమేరు డ్రెయిన్‌తోపాటు డైవర్షన్ కెనాల్‌లో ప్రవాహాలను పునఃపరిశీలించాలని కోరింది.
5 లక్షల ఎకరాలకు పైగా పంటనష్టం :భారీ వర్షాలు, వరదల కారణంగా 2.37 లక్షల మంది రైతులకు సంబంధించిన 5.2 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ, ఉద్యానశాఖలు ప్రాథమికంగా అంచనా వేశాయని ప్రభుత్వం వివరించింది. దీనికి పెట్టుబడి రాయితీగా రూ.341.30 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంటుందని కేంద్రానికి నివేదించింది. వరదల కారణంగా 95 గేదెలు, ఆవులు, 325 మేకలు, గొర్రెలు మృతిచెందాయని పేర్కొంది. 226 పడవలు పాక్షికంగా మరో 217 పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపింది.