AP Financial Condition in First Three Quarters: రాష్ట్రం 9 నెలల ఆర్థిక ముఖచిత్రంలో 58 శాతం రాబడి వస్తే, 128 శాతం అప్పులు ఉన్నాయి. ఈ మేరకు కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ - కాగ్ తొలి మూడు త్రైమాసికాల లెక్కలను బుధవారం వెలువరించింది. రాష్ట్రానికి చెందిన రెవెన్యూ లోటు 224 శాతం పెరిగిందని అందులో స్పష్టం చేసింది. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు ఇంకా ఉండొచ్చు కానీ కాగ్‌కు ఆ లెక్కలు జగన్ సర్కార్ ఇవ్వలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ సర్కారులో చిట్టచివరి ఆర్థిక సంవత్సరమూ అస్తవ్యస్తంగానే ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల మొత్తం లెక్కలను కాగ్ (Comptroller and Auditor General of India) బుధవారం వెలువరించింది. ఈ తొమ్మిది నెలల్లో రాష్ట్రానికి ఆశించిన రెవెన్యూ, పన్నుల రాబడులు లేవు. ఆర్థిక సంవత్సరం మొత్తానికి చేస్తామన్న అప్పుల కంటే ఇంకా ఎక్కువగా తొలి 9 నెలల్లోనే చేసేశారు. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన రుణాలను కాగ్‌కు చెప్పకుండా వైసీపీ ప్రభుత్వం దాటవేస్తోంది.
కొత్త ఏడాదికి అప్పులతో స్వాగతం పలికిన సీఎం జగన్
ఈ ఏడాది మొత్తానికి 2 లక్షల 6 వేల 224 కోట్ల రెవెన్యూ రాబడి వస్తుందని అంచనా వేస్తే, తొమ్మిది నెలల్లో డిసెంబరు నెలాఖరు వరకు లక్షా 19 వేల 125.85 కోట్లే దక్కింది. అంచనా వేసిన మొత్తంలో 57.8 శాతం మాత్రమే రాబడి సాధించారు. పన్నుల రాబడి లక్షా 43 వేల 989.37 కోట్లు వస్తుందని లెక్కిస్తే 91 వేల 136.21 కోట్లే వచ్చింది. మొత్తం అంచనాల్లో ఇది కేవలం 63% మాత్రమే.