AP Election New Candidates for State Legislature :రాష్ట్ర అసెంబ్లీలోకి కొత్తగా 81 మంది అడుగుపెట్టనున్నారు. వీరిలో మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన వారితో పాటు గతంలో కేంద్ర మంత్రులుగా పని చేసిన సుజనాచౌదరి, కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి కూడా ఉన్నారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఐదుగురు మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. విశాఖ, అనకాపల్లి, ప్రకాశం జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున గెలుపొందారు. కూటమి ప్రభంజనంతో అనేక మంది వారసుల అరంగేట్రం సాఫీగా సాగిపోయింది.
మంత్రి సీదిరిని మట్టికరిపించిన శిరీష : వారసుల్ని రాజకీయాల్లోకి తీసుకురావాలనుకోవడం సర్వసాధారణమే కానీ, వారిని గెలిపించుకుని చట్టసభల్లోకి పంపడం అంత సులభం కాదు. కానీ కూటమి ప్రభంజనంతో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడి కుమార్తె యనమల దివ్య, ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థులుగా దివంగత వరుపుల రాజా సతీమణి సత్యప్రభ గెలుపొందారు. టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేశ్ మంగళగిరిలో గెలిచారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ తరఫున సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలు గౌతు శిరీష పోటీచేసి మంత్రి సీదిరి అప్పలరాజును మట్టికరిపించి అసెంబ్లీలో అడుగిడుతున్నారు.
హిందూపురంలో హ్యాట్రిక్ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీభరత్ విశాఖ ఎంపీగా గెలిచారు. రాజంపేట లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి ఓటమి చవిచూడగా ఆయన సోదరుడు కిశోర్‌కుమారెడ్డి పీలేరులో టీడీపీ నుంచి గెలిచారు. అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుంచి గెలిచారు. మాజీమంత్రి పల్లె రఘునారెడ్డి కోడలు సింధూర రెడ్డి పుట్టపర్తి నుంచి గెలిచారు. కర్నూలులో టీజీ వెంకటేశ్ కుమారుడు భరత్ గెలిచారు.
ఓటమిలో వైఎస్సార్సీపీ దిగ్గజ నేతల వారసులు : మచిలీపట్నంలో టీడీపీ నేత కొల్లు రవీంద్రపై మాజీమంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కృష్ణమూర్తి పోటీచేసి ఓడిపోయారు. చీరాలలో వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేశ్ పోటీ చేసి ఓడిపోయారు. తాడిపత్రి, ధర్మవరం స్థానాల నుంచి పోటీచేసిన బాబాయ్ అబ్బాయిలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓడారు. గంగాధర నెల్లూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి ఓటమి చవిచూశారు.
తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏలూరు ఎంపీ స్థానంలో ఆయన కుమారుడు సునీల్ కుమార్ వైఎస్సార్సీపీ నుంచి పోటీచేసి ఓడారు. ఒంగోలు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చంద్రగిరిలో ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి పరాజయం పాలయ్యారు. ఉపముఖ్యమంత్రి బుడి ముత్యాలనాయుడు అనకాపల్లి లోక్‌సభ స్థానంలోనూ, ఆయన కుమార్తె ఈర్లె అనురాధ మాడుగుల అసెంబ్లీ స్థానంలోనూ ఓటమి చవిచూశారు. మంత్రి ఆదిమూలపు సురేశ్ కొండపిలోను, ఆయన సోదరుడు సతీశ్ కోడుమూరులోను పరాజయం పాలయ్యారు.