CM Chandrababu White Paper on the Polavaram : పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసేందుకు జగన్ అహంతో దుస్సాహసం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. పిచ్చి కుక్కా, పిచ్చి కుక్కా.. అనే పదే పదే చెప్తూ మంచి కుక్కని చంపేసిన రీతిలో పోలవరం పట్ల వ్యవహరించాడని ఆయన ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలంటే, ఒక అంశంతో ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నందున నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగానే ముందుకెళ్లగలమని స్పష్టం చేశారు. ప్రజా చైతన్యమే అన్నింటికీ పరిష్కారమార్గమన్న చంద్రబాబు.. రాజకీయాల్లో ఉండేందుకు ఏమాత్రం అర్హత లేని వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వటం వల్ల తగిలిన శాపాలు ఇంకెంతకాలం వెంటాడతాయో కూడా చెప్పలేమన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబుతో గవర్నర్ రాధాకృష్ణన్ భేటీ - ఆ అంశాలపై చర్చ!
పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్రాభివృద్ధికి జీవనాడి అయిన పోలవరానికి శాపం జగన్ అంటూ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. డయాఫ్రమ్ వాల్‌ను 436కోట్ల తో పూర్తి చేస్తే, ఇప్పుడు జరిగిన నష్టానికి మరమ్మతులు చేసేందుకే 447కోట్లు అవుతుందని వివరించారు. ఇంత ఖర్చు చేసినా నష్టం పూర్తిగా భర్తీ అవుతుందనేది సందేహమేనన్న సీఎం, కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలంటే ఇప్పుడు 990కోట్లు అదనంగా ఖర్చవుతుందని తెలిపారు. ఇందుకు 2నుంచి 4సీజన్ల సమయం కూడా వృథా అవుతుందని అన్నారు.
జగన్ మూర్ఖత్వం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఆయన ధ్వజమెత్తారు. 2019 జూన్ నుంచి ఏజెన్సీలు తొలగించి పోలవరం పనులు నిలుపుదల చేశారని మండిపడ్డారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న విషయం 2ఏళ్ల తర్వాత కానీ గుర్తించలేదని అన్నారు. 2009లో కూడా వైఎస్ కాంట్రాక్టర్ ని మార్చటం వల్ల హెడ్ వర్క్స్ నిలిచిపోయాయని, అదే తప్పు జగన్ 2019లో చేసి తీవ్ర తప్పిదానికి పాల్పడ్డారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వ తప్పిదాలపై 2019 ఆగస్టు 16న జలవనరుల కార్యదర్శి పీపీఏకి లేఖకూడా రాశారని అన్నారు. పోలవరం పట్ల జగన్ ప్రభుత్వ తప్పిదాలపై నీతి ఆయోగ్ ఐఐటీ హైదరాబాద్ తో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ 2021 నవంబర్ 5న స్పష్టమైన నివేదిక ఇచ్చిందని చంద్రబాబు తెలిపారు.
జగన్ ప్రభుత్వ నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్టుకు నాలుగు విధాలా నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. మొదటిది డయాఫ్రమ్ వాల్ అయితే, అప్పర్, లోయర్ కాపర్ డ్యాం లు దెబ్బతిన్నాయి, గైడ్ బండ్ దెబ్బతినడంతో పాటు విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణమూ ఆగిపోయిందని అన్నారు. మొత్తంగా ప్రాజెక్టును గోదాట్లో ముంచేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. ఇప్పుడు కేంద్రం అంతర్జాతీయ నిపుణులతో కమిటీ వేసి నిరంతర అధ్యయనం పెట్టిందని తెలిపారు.
ఇక్కడ ఉండే సెంట్రల్ వాటర్ కమిషన్ చేతులు ఎత్తేయటంతో అంతర్జాతీయ నిపుణుల నివేదిక ఆధారంగా ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలని అన్నారు. నిర్ణీత సమయానికి పోలవరం పూర్తి చేయకపోవడం వల్ల వేలాది కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పోలవరంలో అవినీతి అంటూ ఎన్నో అసత్య ఆరోపణలు జగన్ చేసినా ఏ ఒక్కటీ నిరూపించలేకపోయాడని అన్నారు. ఐఏళ్ల పోలవరం నష్టం చూస్తుంటే బాధ, కోపం, ఆవేశం కలుగుతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.