తెలంగాణ

telangana

ETV Bharat / state

పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరో విద్యార్థికి పాము కాటు! - ప్రిన్సిపల్ సస్పెండ్ - GURUKULAM SCHOOL IN JAGTIAL

పాముకాటుతో 24 గంటల్లో ఇద్దరు విద్యార్థులు ఆస్పత్రిపాలు - ప్రిన్సిపల్ నిర్లక్ష్యమే ఘటనకు కారణమంటూ సస్పెన్షన్ ఉత్తర్వులు

SNAKE BITES IN GURUKULAM SCHOOL
పెద్దాపూర్ గురుకుల పాఠశాల (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Updated : 5 hours ago

Gurukula School Snake Bite Issue : జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాముకాటు వేసిందని నిన్న ఓ విద్యార్థి ఆసుపత్రిలో చేరగా ఈ రోజు మరో విద్యార్థికి పాము కాటు ఆనవాళ్లు కన్పించడం కలకలం రేపింది. 8వ తరగతికి చెందిన యశ్వంత్‌ అనే విద్యార్థి పాము కాటు ఆనవాళ్లు కన్పించడంతో తోటి విద్యార్థులు గమనించి టీచర్లకు చెప్పిన వెంటనే కోరుట్ల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నిన్న (డిసెంబరు 18న) ఇదే తరగతికి చెందిన అఖిల్ అనే విద్యార్థికి పాము కాటు వేయడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో విద్యార్థి యశ్వంత్​ను పాము కాటేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆసుపత్రికి చేరుకుని బాలుడ్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. ఇద్దరు విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్ అక్కడి వైద్యులకు సూచించారు.

వరుసగా పాముకాట్లు ఏంటి : అనంతరం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్, పరిసరాలను పరిశీలించి పూర్తి వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల వరుసగా పాముకాటుకు గురి కావడంతో అసలు ఏం జరుగుతుందని కలెక్టర్​ సత్యప్రసాద్​ ఉపాధ్యాయులను గట్టిగా నిలదీశారు. విద్యార్థులు పాముకాటుకు గురయ్యారనే విషయం తెలుసుకొని అందరి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు నెలల క్రితమే ఇలాంటి ఘటనలతో ఇద్దరు విద్యార్థులు మరణించడం సంచలనం రేపింది. అయినా తాజాగా మళ్లీ అలాంటి సంఘటనలు పునరావృతం కావడంతో గురుకుల పాఠశాలలో ఏం జరుగుతుందో తెలియక అటు తల్లిదండ్రులు, ఇటు విద్యార్థులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు.

"పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో అఖిల్​ అనే స్టూడెంట్​కు కాలు మీద బైట్స్​ ఉన్నాయని సమాచారం వచ్చింది. కొంచెం నొప్పి కూడా ఉన్నట్లు తెలిసింది. వెంటనే ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి యాంటివెనమ్​ ఇచ్చి ట్రీట్​మెంట్​ చేస్తున్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉంది. వారి తల్లిదండ్రులకు సమాచారం అందించాం. ఇంకో విద్యార్థికి కూడా ముందు జాగ్రత్తగా ట్రీట్​మెంట్​ ఇస్తున్నాం. పాముకాటు లక్షణాలు ప్రస్తుతానికైతే లేవు" -సత్యప్రసాద్​, జగిత్యాల కలెక్టర్​

తాజాగా ప్రిన్సిపల్​ సస్పెండ్​ : పాముకాటుతో కేవలం ఒకే రోజు వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ఆస్పత్రిపాలు కావడం పట్ల కలెక్టర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నందుకు మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్​ను సస్పెండ్​ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రిన్సిపల్‌ మాధవీలత నిర్లక్ష్యమే ఘటనకు కారణమంటూ కలెక్టర్ ఉత్తర్వులను జారీ చేశారు.

రీల్స్​ మోజులో పాముతో విన్యాసాలు - కాటు వేయడంతో యువకుడి మృతి - Snake bite in Nizamabad

సినిమా షూటింగ్​లో నిజంగానే పాము కాటు - ఆ సెన్సేషనల్​ మూవీకి 25 ఏళ్లు

Last Updated : 5 hours ago

ABOUT THE AUTHOR

...view details