Anganwadi Workers Protest : హామీల అమలు కోరుతూ అంగన్వాడీలు 40వ రోజు కదం తొక్కారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఎక్కడికక్కడ రాస్తారోకోలు చేపట్టారు. విజయవాడలో అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా కార్మిక సంఘాల నేతలు ఆందోళన పాల్గొన్నారు. లెనిన్ సెంటర్లో రాస్తారోకోకు సిద్ధంకాగా అనుమతి లేదంటూ నాయకులను బలవంతంగా పోలీసులు అరెస్టు చేశారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న అంగన్వాడీలు : అనంతపురం జిల్లా ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌ను అంగన్వాడీలు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. తీవ్ర తోపులాట మధ్య పోలీసులు అంగన్వాడీలను పక్కకు లాగిపడేశారు. అనంతపురంలో అంగన్వాడీలకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న సీఐటీయూ నాయకులను అరెస్టు చేశారు. రాయదుర్గంలో వినాయక సర్కిల్ వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
న్యాయపరమైన డిమాండ్లలను కోరుతున్నామే తప్పా గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు : అంగన్వాడీలు
కేజీహెచ్‌లో అంగన్వాడీ మహిళ మృతి : ప్రభుత్వం హెచ్చరించినా ఉద్యోగాల్లో చేరకపోవడంతో వైఎస్సార్ జిల్లా కమలాపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు బాత్‌రూమ్‌కు అధికారులు తాళాలు వేశారు. మహిళలు అవస్థలు పడుతున్నారని వేడుకున్నా తాళాలు ఇవ్వకపోవడంతో ఆందోళన చేశారు. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలంలో ధర్నాకు వెళ్లి కుప్పకూళిన మహిళ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. అంగన్వాడీ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని నిరసన తెలిపారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీలతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రాస్తారోకో నిర్వహించారు.
పోలీసుల తీరుపై ఆగ్రహం : నెల్లూరులో అంగన్వాడీలుచేపట్టిన రాస్తారోకో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సీఐటీయూ ఆధ్వర్యంలోఅంగన్వాడీలు భారీ ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. అంగన్వాడీలను, సీఐటీయూ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసే క్రమంలో ఇరువురి మధ్య తోపులాటలు జరిగాయి. ఈ ఘర్షణలో అంగన్వాడీ కార్యకర్తలు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం బాధితులను ఆస్పత్రికి తరలించారు. పోలీసుల తీరుపై అంగన్వాడీలు మండిపడ్డారు.