AP CM Chandrababu at World Telugu Federation Conference :హైదరాబాద్ గురించి ఆరోజు తాను చెప్పింది ఇవాళ నిజమైందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ప్రాంతం గొప్ప ఐటీ సిటీగా మారుతుందని ఆనాడే ఊహించానని, విజన్ 2020 తయారు చేసుకుని ఆనాడు ముందుకెళ్లామని గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ప్రపంచ నలుమూలలా ఉన్న వివిధ దేశాల తెలుగు సమాఖ్యల అధ్యక్షులు ఇక్కడకు వచ్చారని చంద్రబాబు అన్నారు. తన జీవితంలో ఇది చాలా సంతోషకరమైన రోజు అని పేర్కొన్నారు.
ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నామని, ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైందని ఏపీ సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు, శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు తెలుగువారు ఎక్కడున్నా ఒకటేనని అన్నారు. ఆనాడు విజన్ 2020 తయారు చేసుకుని ముందుకెళ్లామని, తెలుగు ఏంజిల్స్ అనే పేరుతో అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. ప్రపంచంలోనే మేటి నగరంగా హైదరాబాద్ మారిందంటే దూరదృష్టే కారణమని, ఆనాడు టీడీపీ ప్రభుత్వం వేసిన పునాది వల్లే ఇక్కడ ఆదాయం పెరిగిందని వెల్లడించారు. దేశ విదేశాల్లో తెలుగువాళ్లు గొప్పగా రాణిస్తున్నారని, దేశానికి దశ, దిశ చూపించిన వ్యక్తి పీవీ నరసింహారావు అని కొనియాడారు.
ఆనాడు ఐటీ అంటే అనేక మంది ఎగతాళి చేశారు. విదేశాల్లో అనేకమంది తెలుగువారు పారిశ్రామికవేత్తలుగా మారారు. అమెరికాలో తెలుగువాళ్లే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. మీరు ఏ దేశానికి వెళ్లినా అద్భుతంగా రాణించిన తెలుగువాళ్లు కనిపిస్తారు. ఉన్నత చదువులకు అమెరికా వెళ్లిన వారిలో 55 శాతం తెలుగువాళ్లే. ఎక్కడికి వెళ్లినా మాతృభూమిని మరిచిపోకూడదని అనేకసార్లు చెప్పా. నాలెడ్జ్ ఎకానమీలో తెలుగువాళ్లు మరింత ఉన్నతస్థితికి ఎదగాలి' - చంద్రబాబు, ఏపీ సీఎం
ఏఐ, డీప్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి :ఏఐ, డీప్ టెక్నాలజీని తెలుగువాళ్లు అందిపుచ్చుకోవాలని, ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. పెట్టుబడుల కంటే ఐడియాలు చాలా ముఖ్యమని ఆయన అన్నారు. దుబాయి ప్రభుత్వ సాయంతో ఆనాడు ఈ కన్వెన్షన్ నిర్మించామని, ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా అనేక భవనాలు నిర్మించినట్లు తెలిపారు. అనేక దేశాలు తిరిగి ఐటీ కంపెనీలు ఇక్కడకు వచ్చేలా చేశానని గుర్తు చేశారు. తెలుగువాళ్లు ఎక్కడున్నా పరస్పరం సహకరించుకోవాలని, ఐక్యంగా ఉండి ఉన్నత స్థానాలకు ఎదగాలని పిలుపునిచ్చారు. ఏఏ దేశాల్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో తెలుగువాళ్లకు తెలుసన్న చంద్రాబాబు, విజన్ 2047తో ముందుకెళ్తున్నామని తెలిపారు.