అయిదేళ్లుగా ప్రజలకు నరకం చూపించి - ఎన్నికల ముందు ఎందుకీ హడావుడి? Andhra Pradesh Roads Condition in YSRCP Regime : ఏపీ అభివృద్ధిలో రహదారులు కీలక పాత్ర పోషిస్తాయి. కానీ ఏపీలో అధికారంలో ఉన్నవారికి అభివృద్ధిపైన ధ్యాస లేకపోవడంతో రోడ్ల సంగతే మర్చిపోయారు. ప్రజల ప్రాణాలను గాలికొదిలేశారు. కొత్తవి నిర్మించలేదు సరికదా ఉన్నవాటికి మరమ్మతులూ కరవయ్యాయి. ఇంత అధ్వానమైన రోడ్లు గతంలో ఏ ప్రభుత్వంలోనూ లేవని ప్రతి ఒక్కరూ గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్ర, జిల్లా, గ్రామీణ అనే తేడా లేకుండా రహదారులన్నీ అత్యంత ఘోరంగా ఉన్నాయి.
‘గుంతలు పూడ్చి కష్టాలు తీర్చండి బాబోయ్’ అంటూ ప్రజలు మొత్తుకుంటున్నా వైసీపీ సర్కారు పెడచెవిన పెట్టింది. ప్రజల ప్రయాణ కష్టాలు చూస్తున్నా, ఇన్నాళ్లు జగన్‌కు చీమ కుట్టినట్లయినా లేదు. తీరా ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి రోడ్లు గుర్తొచ్చాయి. తాజాగా సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ రహదారులు బాగుచేసేందుకు ఎన్ని నిధులు అవసరమవుతాయంటూ నివేదికలు తీసుకుంటున్నారు.
Damaged Roads Repair in AP : రాష్ట్రంలో ఏటా 8 నుంచి 9 వేల కిలోమీటర్ల మేర దెబ్బతిన్న రహదారులకు బీటీ లేయర్ వేసి మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. కానీ ఈ ఐదేళ్లలో జగన్(AP CM Jagan) ప్రభుత్వం కేవలం ఒక్క ఏడాది మాత్రమే 7 వేల 600 కిలోమీటర్లు పునరుద్ధరించి మమ అనిపించింది. దీనికి కూడా 2 వేల కోట్లను బ్యాంకు రుణంగా తీసుకుంది. ఆ అప్పు వాయిదాలను కూడా పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున వాహనదారుల నుంచి సెస్ వసూలు చేసి చెల్లిస్తోంది. రాష్ట్రంలో రహదారుల దుస్థితిపై సీఎంవో అధికారులు ఇటీవల వరస సమీక్షలు నిర్వహిస్తున్నారు.
శిథిలమైన వంతెనల పరిస్థితి ఏంటి : ఆర్‌అండ్‌బీ పరిధిలో ఎన్ని కిలోమీటర్ల అధ్వానంగా ఉన్నాయి? ఎన్ని కిలో మీటర్లు మరమ్మతులు చేయాలి? ఎంతమేరకు పునరుద్ధరించాలి? విస్తరించాల్సిన రోడ్లు ఎన్ని ఉన్నాయి? శిథిలమైన వంతెనల పరిస్థితి ఏంటంటూ ఆరా తీస్తున్నారు. వీటికి సంబంధించి నివేదికలు, అవసరమయ్యే నిధుల వివరాలు తీసుకుంటున్నారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన రహదారుల అభివృద్ధికి ఏటా 2 వేల కోట్ల రూపాయల వరకు నిధులు క్రమం తప్పకుండా వెచ్చిస్తామని, మళ్లీ అధికారం చేపట్టిన ఐదారు నెలల్లోనే రోడ్లపై ఎక్కడా గుంతలు లేకుండా చేస్తామంటూ ఎన్నికల హామీ ఇచ్చేలా జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
మరోసారి జగన్ వివక్ష - సొంత వారికే సొమ్ములు - మిగతా వారికి గోతులు
300 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ : గత ప్రభుత్వాల్లో వర్షాల ధాటికి రహదారులు దెబ్బతింటే జిల్లాల వారీగా ఇంజినీర్లు టెండర్లు పిలిచి వాటిని సరిజేయించేవారు. వాటికి వార్షిక నిర్వహణ, అత్యవసర మరమ్మతుల కింద ప్రభుత్వం నిధులు విడుదల చేసేది. జగన్ ప్రభుత్వం వచ్చాక ఈ విధానానికి చరమగీతం పాడింది. 2022-23లో మరమ్మతులు చేసిన గుత్తేదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా ఇంకా 300 కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉన్నాయి. దీంతో ఈ సంవత్సరం పనులు చేసేందుకు గుత్తేదారులెవరూ ముందుకు రాలేదు.
మరమ్మతులకు నోచుకోని రోడ్లు : ఏదైనా తారు రోడ్డుకు సగటున ఐదేళ్ల తర్వాత పైన పాత బీటీ లేయర్ తీసి వేసి మళ్లీ కొత్తది వేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 45 వేల కిలో మీటర్ల ఆర్‌అండ్‌బీ రహదారులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పదేళ్లకుపైగా మరమ్మతులకు నోచుకోని రోడ్లు 14 వేల కిలోమీటర్లు, గతంలో రెన్యువల్ జరిగి 5 నుంచి 10 ఏళ్లు అయిన రహదారులు 17 వేల కిలో మీటర్లు ఉన్నాయి. కొన్ని కీలక రహదారులను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయకపోతే ఓటర్ల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందంటూ ఐ-ప్యాక్ బృందం గతేడాది ప్రభుత్వానికో నివేదిక ఇచ్చింది.
నాబార్డు నుంచి ప్రభుత్వం రుణం :దీంతో అన్ని నియోజకవర్గాల్లో 3 వేల 432 కిలోమీటర్ల మేర 336 రహదారులను ‘హై ఇంప్యాక్ట్ రోడ్స్' పేరిట 11 వందల 21 కోట్లతో బాగు చేసేందుకు గతేడాది జులైలో నిధులు మంజూరు చేశారు. టెండర్లు పిలిచి గుత్తేదారులకు అప్పగించారు. కానీ, బిల్లులు మంజూరవుతాయో లేదోననే సందేహంతో గుత్తేదారులు పనులు ప్రారంభించలేదు. దీంతో రాయలసీమ జిల్లాల పరిధిలో పనులకు అవసరమైన 360 కోట్లను నాబార్డు నుంచి ప్రభుత్వం రుణంగా తీసుకుంది. మిగిలిన జిల్లాల్లో విపత్తు నిధులను కేటాయించేలా చూశారు. అయితే ఇప్పటి వరకు వీటిలో 10 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. గుత్తేదారులు 110 కోట్ల మేర పనులు చేస్తే సర్కారు 10 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించింది.
AP Roads Situation రోడ్ల కోసమమంటూ పన్నులు వేశారు .. రుణాలు తీసుకున్నారు! కొత్త రోడ్డు లేదు.. ఉన్నవాటికి రిపేర్లు లేవు..! ప్రచారం మాత్రం పీక్..
ఎక్కడికక్కడ నిలిచిపోయిన రహదారుల విస్తరణ : న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ రుణంతో చేపడుతున్న రహదారుల విస్తరణ ప్రాజెక్టు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. 6వేల 400 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు తొలి దశలో 3 వేల14 కోట్లతో 12 వందల 44 కిలోమీటర్ల విస్తరణ చేపట్టారు. ఇందులో సివిల్ పనుల విలువ 18 వందల 60 కోట్లు. గుత్తేదారులకు 2021 మార్చిలో పనులు అప్పగించారు. 2023 మార్చికి అవి పూర్తి కావాలి. 2024 మార్చి వచ్చినా మొత్తంగా 30 శాతం పనులు కూడా జరగలేదు. అనంతపురం, కర్నూలు వంటి జిల్లాల్లో 5 శాతం కూడా చేయలేదు. ఎన్‌డీబీ (New Development Bank) రుణ అడ్వాన్స్ కింద 230 కోట్లు ఇస్తే ఇందులో దఫదఫాలుగా 210 కోట్లను గుత్తేదారులకు ప్రభుత్వం చెల్లించింది.
ఆ అడ్వాన్స్‌కు రాష్ట్రవాటా 70 కోట్ల రూపాయలు కలిపి చెల్లించే ప్రయత్నమే చేయలేదు. ఇలాగైతే ఈ ప్రాజెక్టును రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర కేంద్ర ఆర్థిక వ్యవహారాలశాఖ, ఎన్‌డీబీ ప్రతినిధులు స్పష్టం చేశారు. అయినా సరే ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు. కేంద్రం నిధులిచ్చే సీఆర్‌ఐఎఫ్‌లో భాగంగా రోడ్ల బాగు కోసం రాష్ట్రానికి 19 వందల కోట్లు మంజూరయ్యాయి. ఇందులో ఏటా 350 కోట్ల మేర గుత్తేదారులకు చెల్లిస్తే తర్వాత కేంద్రం వాటిని రీయింబర్స్ చేస్తుంది. ఆ నిధులను కూడా జగన్ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోయింది.
DSP Transfers in AP: ఏపీలో డీఎస్పీల బదిలీలు.. 50మందిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు
Fake notes printing: నకిలీ నోట్లు కలకలం.. ముగ్గురు అరెస్టు