AP Focus on Coffee Cultivation :రానున్న ఐదేళ్లలో కాఫీ సాగును విస్తృతం చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం పాడేరు ఐటీడీఏ పరిధిలోని పాడేరు, చింతపల్లి, అరకు వ్యాలీ ప్రాంతాల్లో 2.58 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తున్నారు. దీనికి అదనంగా గిరిజన రైతుల్ని ప్రోత్సహించేలా మరో 40 వేల ఎకరాల్లో పంటను విస్తరించేలా అధికారులు చర్యలు చేపడతున్నారు. సంవత్సరానికి 8 వేల ఎకరాల చొప్పున పంటను విస్తరించేలా ప్రణాళిక రూపొందించారు. దీన్ని మూడు విధాలుగా అమలు చేయనున్నారు.
సాధారణంగా కాఫీ పంట సాగుకు సూర్యరశ్మి నేరుగా పడకుండా సరిపడా నీడ ఉండాలి. ఇలా ఇప్పటికే ఇతర మొక్కలు పెంచుతూ నీడ ఉన్న రైతుల పొలాల్లో నేరుగా కాఫీ మొక్కలు నాటనున్నారు. నీడ లేని కర్షకుల పొలాల్లో ఓక్ మొక్కలను పెంచి ఆ తర్వాత కాఫీ సాగు చేపడతారు. ఇప్పటికే సాగు చేస్తున్న పొలాల్లో పెరుగుదల లేని మొక్కలను తొలగించి వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటనున్నారు. దీనికి మొత్తం రూ.400 కోట్ల వరకు వ్యయం కానుంది.
ఎత్తుగా పెరిగిన సిల్వర్ ఓక్ (ETV Bharat) ఉపాధిహామీ అనుసంధానంతో : 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం గిరిజన రైతుల ఆదాయం పెంచేందుకు కాఫీ సాగును విస్తృతంగా ప్రోత్సహించింది. ఈ మేరకు లక్ష ఎకరాల్లో సాగు విస్తరించేలా చర్యలు తీసుకుంది. అప్పట్లో రైతులకు పంట సాగు ఆర్థిక భారంగా కాకుండా ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించి అమలు చేసింది. తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంతో కాఫీ సాగును ప్రొత్సహించేందుకు మళ్లీ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించాలని నిర్ణయించింది. దీనికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అంగీకరించింది.
దీంతో రైతులు కాఫీ సాగుకు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. సాగుకు పంట మొక్కలను ఉచితంగా అందిస్తారు. నర్సరీ నుంచి రవాణా వరకు, మొక్కలు నాటేందుకు లైన్ మార్కింగ్, గోతులు తవ్వడం, పాదులు తీయడం, కందకాలు ఏర్పాటు చేయడం, పొలం చుట్టూ ఫెన్సింగ్ ఇలా అన్నింటికీ ఉపాధి హామీ పథకంలో భాగంగా లేబర్ కాంపోనెంట్ కింద నిధులు మంజూరు అవుతుంది. ఈ మేరకు ఒక్కో రైతుపై రూ.40 వేల నుంచి రూ.70 వేలకు పెట్టుబడి వ్యయాన్ని ఏపీ ప్రభుత్వమే భరిస్తుంది.
గరిష్ఠంగా 5 ఎకరాల వరకు
- కాఫీ పంట సాగు చేసేందుకు మొగ్గు చూపిన గిరిజన రైతులకు ఎకరాకు 1,000 మొక్కల్ని ఏపీ ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుంది. ఒక్కో రైతు ఎకరం నుంచి గరిష్ఠంగా 5 ఎకరాల వరకు సాగు చేసేందుకు సహకారం అందించనుంది. మొక్కలను నాటిన ఏడేళ్లకు కాఫీ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఎకరానికి దాదాపు రూ.25 వేల వరకు ఆదాయం రానుంది. సుమారు 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు స్థిరంగా ఉత్పత్తి కానుంది.
- కాఫీ సాగులో అంతరపంటలు సైతం సాగు చేయొచ్చు. ఈ మేరకు ఇలా మిరియాల సాగును ప్రోత్సహించేలా ఏపీ ప్రభుత్వం ఎకరాకు 200 మొక్కల్ని ఉచితంగా ఇస్తుంది. ఇది సైతం ఏడేళ్లకు ఉత్పత్తి ఇవ్వనుంది. ఎకరానికి రూ.30 వేల ఆదాయం రానుంది.
- కాఫీ పంట సాగుకు సరిపడా నీడ లేని రైతుల పొలాల్లో తొలుత సిల్వర్ ఓక్ మొక్కల్ని నాటుతారు. వీటిని సైతం ఏపీ ప్రభుత్వం ఎకరాకు 1,000 మొక్కల చొప్పున రైతులకు అందిస్తుంది. ఇవి మూడేళ్లలో ఐదు నుంచి ఆరు అడుగుల మేర పొడవుగా పెరుగుతాయి. దాని తర్వాత వాటి నీడ మధ్యలో మొక్కల్ని నాటుతారు.
- ఏటా నవంబరు- డిసెంబరు నుంచే కాఫీ పంట సాగుకు ముందస్తు చర్యలు ప్రారంభిస్తారు. జులై-ఆగస్టు నెలల్లో మొక్కల్ని నాటుతారు. ఈ మేరకు అధికార యంతాంగ్రం చర్యలు చేపట్టింది.