CM Chandrababu Naidu Chit Chat: ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే లక్ష్యంగా పని చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుధ్ఘాటించారు. గత ఐదేళ్ల దుష్పరిణామాల వల్ల రాష్ట్రానికి సరిదిద్దలేని స్థాయిలో నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్డీఏ కూటమికి అధికారం ఇచ్చారని, అందరం కలిసి రాష్ట్రాన్ని బాగు చేస్తామని స్పష్టంచేశారు.
దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి లేనన్ని గొప్ప వనరులు ఏపీకి ఉన్నాయని చెప్పారు. గోదావరి నుంచే 3వేల టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయని, ఆ నీటిని వినియోగించుకోగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు.
కేంద్రం నుంచి ఎలాంటి పదవులు ఆశించలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలోనూ ఎలాంటి పదవులు ఆశించలేదని గుర్తుచేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో సత్సంబంధాల కోసమే స్పీకర్ పదవికి మాత్రం అప్పట్లో అంగీకరించానని చెప్పారు. ఇప్పుడూ ఎలాంటి పదవులు కోరలేదని, కానీ ఎన్డీఏ నుంచి వచ్చిన ఆఫర్‌ని కాదనకుండా, రెండు మంత్రి పదవులు తీసుకున్నట్లు వివరించారు.
"దటీజ్ చంద్రబాబు" హాట్‌టాపిక్‌గా దిల్లీ తొలి పర్యటన- నాడు జగన్ 29సార్లు - CBN Delhi Tour
గత ఐదేళ్ల జగన్ పాలనతో అమరావతిపైన ఉన్న ఆకర్షణ కొంత తగ్గిందన్నారు. అమరావతికి కోల్పోయిన ప్రతిష్టను తీసుకురావడమే ప్రధాన ధ్యేయంగా పని చేస్తున్నట్లు చెప్పారు. 135 ప్రభుత్వ కార్యాలయాలు అమరావతిలో ఏర్పాటు కాబోతున్నాయని, అవసరమైన ప్రాథమిక మౌలిక వసతులన్నీ కల్పిస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఐకానిక్ బిల్డింగ్స్ సహా అన్ని కార్యాలయాల నిర్మాణాలను పూర్తి చేయబోతున్నామని, వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నటువంటి భవనాలను తొలుత పూర్తి చేస్తామని వివరించారు.